Jaya Prada: జయప్రదను అరెస్ట్‌ చేయాలని కోర్టు ఆదేశాలు

Jaya Prada: జయప్రదను అరెస్ట్‌ చేయాలని కోర్టు ఆదేశాలు

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్‌ చేయాలని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు మంగళవారం(ఫిబ్రవరి 13) ఆదేశించింది. జయప్రదను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేయాలని, ఈనెల 27న ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఎస్పీని ఆదేశించింది.

ఏంటి ఈ కేసు..?

2019 లోక్​సభ ఎన్నికల సమయంలో జయప్రద బీజేపీ అభ్యర్థిగా రాంపుర్​ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. వీటిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆమెకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు​ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే, విచారణ సమయంలో ఆమెపై ఇప్పటివరకూ ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

జయప్రద ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే తొలిసారి కాదు. చెన్నై కోర్టు గతేడాది ఒక కేసులో జయప్రదను దోషిగా తేలుస్తూ 6 నెలల జైలు, రూ.5,000 జరిమానా విధించింది.

Also Read:దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ స్కీం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..