లంబాడాలకు 8 సీట్లు ఇయ్యాలె: రాములు నాయక్

లంబాడాలకు  8 సీట్లు ఇయ్యాలె: రాములు నాయక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జనాభాకు తగట్టుగా లంబాడాలకు టికెట్లు కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత రాములు నాయక్‌ పార్టీ హైకమాండ్ ను డిమాండ్ చేశారు. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు, వైరా, ఖానాపూర్, దేవరకొండ, బోద్‌ నియోజకవర్గాలను లంబాడాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీలకు ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాచలం, అశ్వరావుపేట, పినపాక నియోజకవర్గాలు ఇవ్వాలని సూచించారు. 

బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో  3 కోట్ల 50 లక్షల 5 వేల మంది ఉండగా.. వారిలో 31.78 లక్షల మంది ఎస్టీలు ఉన్నారని  రాములు నాయక్‌  గుర్తు చేశారు. ఎస్టీల్లో లంబాడాలు 20.44లక్షలు, కోయలు 3.81 లక్షలు, గోండులు 2.71 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ప్రతీసారి లంబాడాలకు 7 సీట్లు మాత్రమే ఇస్తున్నారని, ఈసారి 8 సీట్లు ఇవ్వాలని కోరారు.  3 జనరల్ సీట్లు కూడా ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని 40 సీట్లలో ఎస్టీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ల కేటాయింపు చేయాలన్నారు. కాగా..తాను మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్నానని నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ వెల్లడించారు.