- ఇప్పటికే జిల్లాను మూడు ముక్కలు చేశారు: మల్‌రెడ్డి రంగారెడ్డి
- జీహెచ్‌ఎంసీ బిల్లుపై రివ్యూ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ప్రజాభిప్రాయం తీసుకోకుండానే రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 మున్సిపాలిటీలను 27 జాగాల్లో కలుపుతున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాకంటూ ఓ స్వరూపం, అస్థిత్వం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే జిల్లాను మూడు ముక్కలుగా చేశారన్నారు. దీనిని ప్రజలెవరూ క్షమించరన్నారు.
శుక్రవారం అసెంబ్లీలో జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుపై ఆయన మాట్లాడారు. మంచి చేయాలనుకున్నప్పుడు కనీసం ప్రజాభిప్రాయం తీసుకోవాల్సింది కదా అని సీఎంను ప్రశ్నించారు. పేపర్ మీద, మ్యాపుల్లో చూసి విలీనం చేసేస్తారా అని నిలదీశారు.
ఇష్టం వచ్చినట్టు విలీనం చేస్తే ఎలాగని మండిపడ్డారు. ఇలాగే చేస్తే ప్రజల ముందుకు నేతలు, అధికారులు వెళ్లే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఆదాయాన్ని ముక్కలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ విలీనం తప్పులతడకగా ఉందని, ఒకసారి దీనిపై రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు జీహెచ్‌ఎంసీకి చెరోవైపు ఉండేలా విలీనం ఉండాలని సూచించారు.
