నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ జిల్లాలో  విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్​ కర్నూల్, నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ‘జిల్లాలో విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాను ముందువరుసలో నిలిపేందుకు టీచర్లు, విద్యాశాఖ అధికారులు ఎంతో కృషి చేశారు. వైద్యరంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరులో మార్పులు సాధించాం’ అని కలెక్టర్​బాదావత్ సంతోష్ అన్నారు. 

శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రెస్​మీట్​లో కలెక్టర్​గతేడాది జిల్లాలో సాధించిన పురోగతిని వివరించారు. అక్షరాస్యతలో రాష్ట్రంలో 23వ స్థానంలో ఉన్న జిల్లాను 13వ స్థానంలోకి తేవడానికి టీచర్లు, విద్యాశాఖ అధికారులు, గురుకులాల సిబ్బంది పకడ్బందీగా పని చేశారన్నారు. జిల్లాలోని 157 గురుకులాలను ప్రత్యేక ఇన్​చార్జ్​లను నియమించి అకాడమిక్​ ప్రోగ్రామ్స్, సిలబస్, శానిటేషన్, నాణ్యమైన ఫుడ్ అందించామని తెలిపారు. 

బాలకార్మికులను బడిలో చేర్పించే ప్రోగ్రాంకు ఎంతో కృషి చేశామన్నారు. పీహెచ్​సీలను స్ట్రీమ్​లైన్ చేసి ఆరోగ్యానికి భరోసా కల్పించామని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ, మందుల సరఫరా, సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లాలోని టూరిజం ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా క్యాంటీన్లు, ఇతర స్థానిక ఉత్పత్తుల విక్రయాలు జరిగేలా చూస్తామన్నారు. 

భూభారతి సమస్యల పరిష్కారానికి శుక్రవారం నుంచి నెల రోజులపాటు స్పెషల్​ డ్రైవ్​చేపట్టి వీలైనన్నీ దరఖాస్తులను క్లియర్​ చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు త్వరలో శిక్షణ ఇస్తామని తెలిపారు. అనంతరం అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను శాఖలవారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అధికారులు తదితరులుపాల్గొన్నారు.