
- నేషనల్ బీసీ కమిషన్ ముందు ముచ్చర్ల ఫార్మాసిటీ బాధిత రైతుల ఆవేదన
- కేసీఆర్ బంగారు తెలంగాణ అంటే నమ్మి మోసపోయినం
హైదరాబాద్, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ అని మాటలు చెప్తే నమ్మి మోసపోయినం. టీఆర్ఎస్కు ఓట్లేసిన పాపానికి ఇప్పుడు అనుభవిస్తున్నం. ఫార్మా కంపెనీ అంటే ఆయుర్వేదర కంపెనీలనుకున్నం. పచ్చని పంటలు పండే భూములను అమ్ముకొని బతుకులను రోడ్లపై పడేసుకున్నం. వ్యవసాయ భూములు లేక బికారులయినం. సీఎం కేసీఆర్ బర్లు గొర్లు ఇచ్చి మా బంగారు భూములు గుంజుకున్నరు’’.. ఇదీ రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతుల ఆవేదన. శుక్రవారం ఫార్మాసిటీ కోసం సర్కారు తీసుకున్న భూముల పరిశీలనకు వచ్చిన నేషనల్ బీసి కమిషన్ అధికారుల ముందు వాళ్లు ఇలా తమ ఆవేదన వ్యక్తం చేశారు. విషపూరితమైన ఫార్మా కంపెనీల కోసం తమ బతుకుల్లో విషం నింపారని ఆవేదన చెందారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు ఆగమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి సర్కారు భూముల్ని బలవంతంగా గుంజుకుందని కొందరు బీసీ రైతులు చేసిన ఫిర్యాదు మేరకు యాచారం, కందుకూరు మండలాల్లోని నానక్‌నగర్, తాడిపత్రి, మేడిపల్లి, కుర్మిద్ద, ముచ్చర్ల, సాయిరెడ్డి గూడెంలో భూములను కమిషన్ వైస్‌చైర్మన్ డాక్టర్ లోకేశ్ కుమార్ ప్రజాపతి, మెంబర్లు కుశలేంద్ర సింగ్ పటేల్, తల్లోజు ఆచారీలు పరిశీలించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తెస్తున్నరు
భూ సేకరణను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వ అధికారులు, అధికార టీఆర్ఎస్ నేతలు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, తమను ఇబ్బందులు పెట్టి భూములను బలవంతంగా గుంజుకున్నారని కమిషన్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఊళ్లలో అసలు పొలాలే లేకుండా పోయాయని వాపోయారు. ఫార్మా సిటీని తీసేసే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. పెద్ద చదువులు చదివిన తమ పిల్లలకు ఉద్యోగాలే లేవని, ఉన్న భూములను సాగు చేసుకుని బతుకుదామనుకున్నా.. వాటిని సర్కారు గుంజుకుందని ఓ మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన భూములను తీసుకున్నారని, తాము ఏమైపోవాలని ఓ వృద్ధ రైతు బాధపడ్డారు. ఊర్ల దత్తత పేరుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి తమ వ్యవసాయ భూములు దౌర్జన్యంగా గుంజుకున్నారని ఓ మహిళా కౌలు రైతు చెప్పారు.
గ్రామసభ లేకుండనే ఎట్ల లాక్కుంటరు?
‘‘భూసేకరణపై స్థానిక ఆర్డీవో నాలుగు పేజీల లేఖ ఇచ్చారు. గ్రామ సభల్లో ఆమోదించి భూములు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం బలవంతంగా గుంజుకుంటున్నారని అంటున్నారు. గ్రామ సభ జరగకుండానే భూములు ఎట్లా లాక్కుంటరు? సర్కారు నోటిఫికేషన్ ఇచ్చిన విషయమూ రైతులకు తెలియదు. నష్టపరిహారం ఎంతిస్తరో కూడా చెప్పకుండానే భూములు లాక్కున్నారని రైతులు చెబుతున్నారు’’ అని బీసీ కమిషన్ మెంబర్కుశలేంద్ర సింగ్ పటేల్ అన్నారు.
అన్నీ పోగొట్టుకున్నరు
‘‘రైతులు భూములను, బీసీలు కుల వృత్తులను కోల్పోయారు. భూములు తీసుకున్నప్పుడు ఇతర కులాల వారి వృత్తుల గురించి కూడా సర్కార్ ఆలోచించి ఉండాల్సింది. ఫార్మా కంపెనీ వస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది. మున్ముందు రంగారెడ్డి విషపూరిత జిల్లాగా మారుతుంది. భూసేకరణ చేసే అధికారులు, రైతులను ఢిల్లీకి పిలిచి మాట్లాడుతాం. ఫ్యాక్టరీలను సిరిసిల్లలోనో, గజ్వేల్లోనో పెట్టుకొని అక్కడోళ్లోకు ఉద్యోగాలివ్వండి. పచ్చని ఊర్లను నాశనం చేయొద్దు’’ అని బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి చెప్పారు.
భూములను లాక్కున్నట్టు అర్థమవుతోంది
చట్టం ప్రకారం భూసేకరణ జరగట్లేదని రైతులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఫార్మా సిటీ ప్రాజెక్టు రిపోర్ట్‌ను రైతుల ముందు పెట్టాలి. 80 శాతం మంది ఒప్పుకుంటేనే భూమి తీసుకోవాలి. ఫార్మా సిటీకి ముందు 3 వేల ఎకరాలు, తర్వాత 5 వేల ఎకరాలు, ఇప్పుడు 19 వేలకు పైగా ఎకరాలను లాక్కున్నట్టు అర్థమవుతోంది. అసలు ఎంత భూమి అవసరమో అధికారులు చెప్పాలి. కానీ ఆ ప్రశ్నకు ఆర్డీవో వద్ద కూడా సమాధానం లేదు. ఒక్క రైతు కుటుంబానికీ అన్యాయం జరగకుండా చూస్తాం. అవసరమైతే ఇక్కడి అధికారులను ఢిల్లీకి పిలిచి విచారిస్తాం.
– డాక్టర్ లోకేశ్ కుమార్ ప్రజాపతి, నేషనల్ బీసీ కమిషన్ వైస్ చైర్మన్