
చిన్నప్పుడు బాగా చదువుకోవాలి అనుకుంది. కానీ..కుదర్లేదు.చదువు మధ్యలోనే మాన్పించి పెండ్లి చేశారు.దాంతో కుటుంబం బాధ్యతలు మీదపడ్డాయి. వయసుతోపాటే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. చివరకి యాభై పదుల వయసులో ఆమెకు ఒక అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుని ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగింది రాణి. పనస పండ్లతో లక్షల్లో సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
రాణి సన్నీది కేరళలోని ఇడుక్కి. ఆమెకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. వాళ్ల ఇల్లు కూడా ఆ పొలానికి ఆనుకునే ఉంటుంది. ఆ భూమిలో వాళ్లు ఎక్కువగా యాలకులు పండిస్తుంటారు. యాలకుల మొక్కలపై నేరుగా ఎండ పడితే దిగుబడి తక్కువగా వస్తుంది. అందుకే ఈ తోటల్లో నీడ కోసం పెద్దపెద్ద చెట్లను కూడా పెంచుతారు. వాటి నీడలో యాలకుల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అలా రాణి వాళ్ల యాలకుల తోటలో పనస చెట్లను పెంచారు. అయితే..వాళ్లు ఎన్నో ఏండ్లుగా వాటిని కేవలం నీడ కోసం పెంచే చెట్లుగానే చూశారు. ఎప్పుడూ వ్యాపార కోణంలో ఆలోచించలేదు. కొన్ని కాయలు వాళ్లు కోసుకుని మరికొన్ని చుట్టుపక్కల వాళ్లకు ఇచ్చేవాళ్లు. ఇక మిగిలినవి రాలిపోయి యాలకుల మొక్కల మీద పడతాయనే ఉద్దేశంతో కోసి బయట పారేసేవాళ్లు. ‘‘మా ప్రాంతం యాలకుల సాగుకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఇతర రైతుల్లాగే మేము కూడా యాలకుల తోటలో జాక్‌ఫ్రూట్ చెట్లను పెంచాం. ప్రతి చెట్టు 10 నుంచి 50 జాక్‌ఫ్రూట్స్ దిగుబడిని ఇస్తుంది. కానీ.. వాటితో కూడా డబ్బు సంపాదించవచ్చు అని మేం ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే వాటిని పారేసేవాళ్లం”అంటూ చెప్పుకొచ్చింది రాణి.
చిన్నగా మొదలై..
రాణి 2017లో ‘ఈడెన్ జాక్‌ఫ్రూట్ ప్రొడక్ట్స్’ పేరుతో ఒక స్టార్టప్ పెట్టింది. అప్పటికే వాళ్ల ఇంట్లో డ్రైయర్ కూడా ఉండటంతో తన ఇంటికి ఆనుకుని ఉన్న చిన్న గదిలో ప్రొడక్ట్స్‌ని తయారుచేయించింది. వృథాగా పారేసే పండ్ల నుంచి లాభాలు రావడం మొదలైంది. దాంతో జాక్‌ఫ్రూట్స్‌తో శ్నాక్స్ కూడా తయారుచేయడం మొదలుపెట్టింది. ‘‘చిన్నప్పుడు మా అమ్మ జాక్‌ఫ్రూట్స్‌తో ఎన్నో రుచికరమైన శ్నాక్స్ చేసేది. నేను రోజూ స్కూల్ నుంచి వచ్చాక వాటిని తినేదాన్ని. ముఖ్యంగా కుంబిలప్పం (బియ్యం పిండి, బెల్లంతో ఉడికించిన జాక్‌ఫ్రూట్ కోన్ కేకులు), చక్కా పుజుక్కు (తురిమిన కొబ్బరి, స్పైసెస్, జాక్‌ఫ్రూట్‌తో చేసే శ్నాక్) చాలా బాగా చేసేది. అలాంటి వాటిని నేను కూడా తయారుచేసి అమ్మాలి అనుకున్నా. అందుకే జాక్‌ఫ్రూట్స్‌తో చక్కా వట్టల్ చిప్స్ తయారుచేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చా. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చిన్నప్పుడు మా తమ్ముడు, నేను వాటి కోసం గొడవ పడేవాళ్లం” అంటూ తన జర్నీని చెప్పుకొచ్చింది రాణి. ఇప్పుడు కేవలం పనస పండ్ల మీదే ఏటా రూ.8లక్షల వరకు సంపాదిస్తోంది రాణి.
మొదట్లో వైట్ లేబులింగ్
ప్రొడక్ట్స్‌ని నేరుగా మార్కెట్‌లో అమ్మాలంటే కొంతైనా వ్యాపార అనుభవం ఉండాలి. అందుకే మొదట్లో రాణి తయారుచేసిన హై క్వాలిటీ జాక్‌ఫ్రూట్ ప్రొడక్ట్స్‌ని స్థానిక అధికారుల సపోర్ట్‌తో వైట్ లేబులింగ్‌తో అమ్మింది. అంటే ప్రొడక్ట్స్‌కి ఎలాంటి లేబుల్ వేయకుండా వేరే కంపెనీలకు అమ్మేది. వాళ్లు తమ బ్రాండ్ పేరుతో అమ్ముకునేవాళ్లు. ఇప్పుడు మాత్రం సొంతంగానే అమ్ముతోంది. అందుకోసం ప్రత్యేకంగా ఈ కామర్స్ వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేసుకుంది. సోషల్ మీడియా ద్వారా కూడా ప్రమోషన్ చేస్తోంది. అలా ఆమె ప్రొడక్ట్స్‌కి డిమాండ్ పెరగడంతో ఇప్పుడు చుట్టుపక్కల 20 మంది రైతుల నుంచి పనస పండ్లను కొని, ప్రొడక్ట్స్ తయారుచేస్తోంది. పండ్లను ప్రాసెస్ చేయడానికి ఆమె దగ్గర పది మంది పనిచేస్తున్నారు.
అన్నీ తానై..
గృహిణి నుంచి వ్యవస్థాపకురాలిగా మారిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ రాణి “నాకు చిన్నప్పటి నుంచి ఖాళీగా ఉండడమంటే ఇష్టముండదు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటా. ఇప్పుడు కూడా ఉదయం 5 గంటలకు నిద్రలేవడంతో నా రోజు మొదలవుతుంది. ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటా. ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్తా. సాయంత్రం వరకు అక్కడే ఉంటా. అన్ని పనులూ దగ్గరుండి చూసుకుంటా” అంటోంది.
ఆమె కూతురు అన్నా తన తల్లి గురించి ‘‘మా అమ్మ పనిని చాలా గౌరవిస్తుంది. 57 ఏండ్ల వయసులో కూడా మల్టీ టాస్కింగ్ చేస్తుంటుంది. ఆమె ఎనర్జీని చూస్తుంటే అప్పుడప్పుడు ఆశ్చర్యమేస్తుంటుంది. యూనిట్‌లో 10 నిమిషాలు కూర్చోవడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు’’ అని చెప్పింది.
చిన్నప్పటినుంచి ..
రాణికి చిన్నప్పటినుంచి బాగా చదువుకోవాలనే కోరిక ఉండేది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరినా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే మాన్పించేశారు. చిన్న వయసులోనే పెండ్లి చేయడంతో ఇంటికే పరిమితమైంది. కానీ.. ఆమెకు ఎప్పుడూ బిజినెస్, ఇన్నొవేషన్స్ పట్ల బాగా ఇంట్రస్ట్ ఉండేది. అందుకే యాభై పదుల వయసులో కూడా కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సాధికారత కార్యక్రమం ‘కుటుంబంశ్రీ’ ద్వారా ట్రైనింగ్ తీసుకుంది.
దానివల్ల ఆమెలోని ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగాలనే సంకల్పం మరింత బలపడింది. అక్కడామె చుట్టుపక్కల ఉన్న వనరులతో లాభాలు ఎలా పొందాలి? వాటిని సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలి? అనే విషయాలు తెలుసుకుంది. అప్పుడే ఆమెకు పనస పండ్లతో అనేక రకాల ప్రొడక్ట్స్‌ని తయారుచేయొచ్చని తెలిసింది. అలా ఎండిన పనసకాయలు, వాటితోచేసే పొడులు, ఫ్రోజెన్ జాక్ ఫ్రూట్, ఎండబెట్టిన విత్తనాలు, వాటి పొడి, జాక్‌ఫ్రూట్ పల్ప్ లాంటివి తయారుచేయడంపై రీసెర్చ్ చేసింది.