రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియానికి ఇవాళ శంకుస్థాపన

రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియానికి ఇవాళ శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: రాంజీ గోండు స్మారక ట్రైబల్ మ్యూజియానికి కేంద్ర ట్రైబల్ శాఖ మంత్రి అర్జున్ ముండా, టూరిజం మంత్రి కిషన్ రెడ్డిలు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అబిడ్స్‌‌లో రూ.34 కోట్లతో 0.75 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ మ్యూజియం కోసం కేంద్ర ప్రభుత్వం 2019–-20లోనే రూ.15 కోట్లు మంజూరు చేసి, తెలంగాణకు చెందిన పోరాట యోధుడు రాంజీ గోండు పేరు పెట్టాలని నిర్ణయించిందని కిషన్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చిస్తున్నదన్నారు. మూడు అంతస్తులుగా ఉండే ఈ మ్యూజియంలో.. మొదటి అంతస్తులో నిర్మల్ ఘాట్లలో రాంజీ గోండు ఆధ్వర్యంలో జరిగిన పోరాట ఘట్టాలు, వెయ్యి ఉరుల మర్రి దృశ్యాలను, నాటి పోరాట యోధులు వాడిన వస్తువులు ప్రదర్శనకు ఉంచుతారు. 

 
రెండో అంతస్తులో తెలంగాణకు చెందిన పోరాట యోధుడు కుంమ్రం భీమ్, బిర్సా ముండా, ఇతర గిరిజన యోధుల పోరాట చరిత్రను చూపించే ఏర్పాట్లుంటాయి. మూడో అంతస్తులో.. రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు (పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్.. చెంచులు, కొండారెడ్లు.. మొదలైన వారు)కు సంబంధించిన కళలు, కళాకృతులు, ఆచార వ్యవహారాలను తెలిపే ఏర్పాట్లు చేయనున్నారు. దీంతోపాటుగా మసబ్ ట్యాంకులో వందశాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో (రూ.6.5కోట్లు) నిర్మాణం పూర్తిచేసుకున్న ట్రైబల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ ను  కూడా కేంద్రమంత్రులు ప్రారంభించనున్నారు.