Ranji Trophy 2025-26: నేటి నుంచి (అక్టోబర్ 15) రంజీ ట్రోఫీ.. 32 జట్లతో నాలుగు గ్రూప్‌లు.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!

Ranji Trophy 2025-26: నేటి నుంచి (అక్టోబర్ 15) రంజీ ట్రోఫీ.. 32 జట్లతో నాలుగు గ్రూప్‌లు.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!

ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మక రెడ్-బాల్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ నేడు (అక్టోబర్ 15) ప్రారంభమైంది. ఇది టోర్నమెంట్ 91వ ఎడిషన్.  ఇండియాలోనే టాప్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఈవెంట్‌గా రంజీ ట్రోఫీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తలపడే ఈ టెస్ట్ క్రికెట్ సమరంలో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. మొత్తం 38 జట్లు పాల్గొంటాయి. వీటిలో 32 జట్లు ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం ఎలైట్ గ్రూప్‌లో పోటీపడతాయి. ప్లేట్ గ్రూప్‌లోని ఆరు జట్లు వచ్చే సీజన్‌లో ఎలైట్ గ్రూప్‌కి ప్రమోషన్ కోసం ఆడతాయి. ఈ మెగా టెస్ట్ టోర్నమెంట్ రెండు దశల్లో జరుగుతుంది. 

మొదటి దశ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 19 వరకు జరుగుతుంది. రెండవ దశ జనవరి 22న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ రెండు దశల మధ్య, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లు జరుగుతాయి. తొలి రౌండ్ మ్యాచ్‌లలో డిఫెండింగ్ ఛాంపియన్స్ విదర్భ నాగాలాండ్‌తో తలపడనుండగా.. ముంబై జమ్మూ అండ్ కాశ్మీర్‌తో తలపడనుంది. గత సీజన్ రన్నరప్ కేరళ.. మహారాష్ట్రతో తలపడనుంది.

రంజీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూప్‌లు:

గ్రూప్ ఏ: ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, తమిళనాడు, జార్ఖండ్, ఒడిశా, బరోడా, నాగాలాండ్, విదర్భ
గ్రూప్ బి: సౌరాష్ట్ర , కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్
గ్రూప్ సి: రైల్వేస్, హర్యానా, బెంగాల్, ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, సర్వీసెస్, త్రిపుర
గ్రూప్ డి: హైదరాబాద్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ & కాశ్మీర్, ముంబై, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్

ప్లేట్ గ్రూప్: బీహార్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, మిజోరం

రంజీ ట్రోఫీ 2025-26: లైవ్ స్ట్రీమింగ్, లైవ్ టెలికాస్టింగ్ వివరాలు

రంజీ ట్రోఫీ 2025–26 మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ ఇండియాలో జియో హాట్ స్టార్ యాప్ తో పాటు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. లైవ్ టెలికాస్టింగ్ విషయానికి వస్తే స్టార్ స్పోర్ట్స్, ఖేల్ టీవీ ఛానెల్‌లో చూడవచ్చు . అయితే అన్ని రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం ఉండదు. ప్రధాన మ్యాచ్ లు మాత్రమే లైవ్ టెలికాస్ట్ అవుతాయి.