Ranveer Singh Apologizes: 'కాంతార' అనుకరణ వివాదం.. క్షమాపణ చెప్పిన హీరో రణవీర్ సింగ్!

Ranveer Singh Apologizes: 'కాంతార' అనుకరణ వివాదం..  క్షమాపణ చెప్పిన హీరో రణవీర్ సింగ్!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ వివాదాల్లో చిక్కుకున్నారు.  ఇటీవల గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025 ముగింపు వేడుకలో ఆయ చేసిన వ్యాఖ్యలు, అనుకరణ పెద్ద వివాదానికి దారితీసింది.. రిషబ్ శెట్టి బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతార: చాప్టర్ 1' లోని కీలకమైన 'దైవ' సన్నివేశాన్ని ఆయన అనుకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. దైవాలను 'దైయ్యాలు' అని  రణవీర్ మాట్లాడటం మరింత వివాదాస్పదమైంది.

రణవీర్ సింగ్ క్షమాపణ 

ముఖ్యంగా కన్నడిగులు, సినీ ప్రియుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రణవీర్ సింగ్ క్షమాపణ చెప్పారు. మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేశారు. "నా ఉద్దేశ్యం కేవలం రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే. ఒక నటుడిగా, ఆ సన్నివేశంలో ఆయన చూపిన అసాధారణమైన కృషి నాకు తెలుసు. దాని పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, సాంస్కృతిక వైవిధ్యం పట్ల తన గౌరవాన్ని తెలియజేస్తూ..  'నేను ఎప్పుడూ మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం , నమ్మకాన్ని లోతుగా గౌరవించాను. నేను ఎవరి మనోభావాలను గాయపరిచినా, దానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను" అని రణవీర్ సింగ్ పోస్ట్ ద్వారా తెలిపారు.

అసలు ఏం జరిగింది?

గోవాలోని IFFI వేదికపైకి వచ్చిన రణవీర్ సింగ్, 'కాంతార' క్లైమాక్స్ సన్నివేశంలో రిషబ్ శెట్టి చేసిన 'దైవ' పాత్రను అనుకరించారు. రిషబ్ శెట్టిని నేరుగా సంబోధిస్తూ.. "నేను 'కాంతార చాప్టర్ 1' థియేటర్లలో చూశాను. అద్భుతమైన ప్రదర్శన. ముఖ్యంగా ఆ ఆడ దెయ్యం (చాముండి దైవ) నీ శరీరంలోకి ప్రవేశించే షాట్ అద్భుతం  అని ఆయన అన్నారు. ఈ సమయంలో రిషబ్ శెట్టి నవ్వుతూ కనిపించినప్పటికీ, సోషల్ మీడియాలో నెటిజన్లు రణవీర్ వ్యాఖ్యలు, అనుకరణ అగౌరవంగా ఉన్నాయని విమర్శించారు. దైవాలను కేవలం 'దెయ్యాలు'గా అభివర్ణించడం తీవ్ర అభ్యంతరకరమని, అవి అడవి దేవతలని, కేవలం దెయ్యాలు కావని వారు  స్పష్టం చేశారు.