- హుస్నాబాద్ ఇండస్ట్రీయల్ పార్క్‌కు లైన్ క్లియర్
- తుది దశకు చేరిన ఫీల్డ్ సర్వే.. భూసేకరణ ప్రక్రియ కొలిక్కి
- ఎకరానికి రూ.18 లక్షల పరిహారం చెల్లింపునకు ఓకే
సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇండస్ట్రీయల్ పార్క్ కోసం 124.34 ఎకరాలు సేకరిస్తుండగా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో 25.20 ఎకరాలు, అక్కన్నపేట మండలం చౌటపల్లిలో 83.36 ఎకరాలు, జనగామలో 15.26 ఎకరాలను 199 మంది రైతుల నుంచి సేకరిస్తోంది.
ఇప్పటికే తోటపల్లి, జనగామ గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తవ్వగా చౌటపల్లిలో ఈ ప్రక్రియ సాగుతోంది. చౌటపల్లిలో ప్రభుత్వ భూమిని సేకరిస్తుండగా మిగిలిన రెండు గ్రామాల్లో పట్టా భూములను సేకరించడానికి గతంలోనే అధికారులు డిక్లరేషన్ విడుదల చేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యం
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్‌లో కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే స్థానిక పంటలకు ప్రోత్సాహం లభించనుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో వరి, పత్తి, మక్కజొన్న , పప్పు దినుసుల సాగు ఎక్కువగా ఉంది. సమీపంలోనే గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభమైతే నీటి లభ్యత పెరిగి కూరగాయల సాగు పెరిగే చాన్స్ ఉంది.
దీనికి తోడు కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాలకు సమీపంలో నే ఉండడం, హుస్నాబాద్ మీదుగా హైవే పనులు పూర్తి కావడంతో ఇండస్ట్రియల్ పార్క్‌కు మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పడతాయి. కొత్త పల్లి నుంచి జనగామ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తుండగా దీనికి సమీపంలోనే ఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తుండటం సానుకూలాంశంగా మారింది. కరీంనగర్, సిద్దిపేట రైల్వే స్టేషన్లు సైతం 40 కిలో మీటర్ల పరిధిలోనే ఉండడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా సులభంగా మారనున్నది.
మంత్రి చొరవతో పెరిగిన పరిహారం
ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో విలువైన భూములు కోల్పోతామని భావిస్తున్న రైతులకు మంచి పరిహారం ఇవ్వడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధిత రైతులకు ఎకరాకు రూ.13 లక్షలు ఇవ్వాల్సి ఉండగా మంత్రి చొరవతో మరో రూ.ఐదు లక్షలు.. మొత్తంగా 18 లక్షలు పరిహారం అందేలా చూస్తున్నారు. వివాదాలు లేని క్లియర్ టైటిల్ భూములకు సంబంధించి రైతులకు తక్షణమే పరిహారం అందజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫీల్డ్ సర్వేతో వీడనున్న చిక్కుముళ్లు
చౌటపల్లిలో అసైన్డ్ భూముల విషయంలో నెలకొన్న సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలన్న పట్టుదలతో రెవెన్యూ యంత్రాంగం ఫీల్డ్ సర్వే నిర్వహిస్తోంది. ప్రస్తుతం వివాదాస్పద భూములకు సంబంధించి రీ-సర్వే, వెరిఫికేషన్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన సాగుతుండగా చౌటపల్లి రికార్డులకు క్షేత్రస్థాయి సాగుకు మధ్య ఉన్న చిన్నపాటి వ్యత్యాసాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న ఫీల్డ్ సర్వే సైతం ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియ మరో నాలుగైదు రోజుల్లో పూర్తి కానుంది. ఈ ప్రక్రియ ముగియగానే అర్హులైన రైతులందరికీ పరిహారం చెల్లించి, భూమిని పరిశ్రమల శాఖకు అప్పగించనున్నారు.
వారంలో భూసేకరణ పూర్తి
ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. భూసేకరణ విషయంలో ఎదురవుతున్న సమస్యలను వారంలో పరిష్కరిస్తాం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతోంది. సర్వే పూర్తి కాగానే అర్హులైన రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారాన్ని అందించి, భూములను పరిశ్రమల శాఖకు అప్పగిస్తాం.
మధుసూదన్, తహసీల్దార్, అక్కన్నపేట
