గాంధీ దవాఖానలో అరుదైన ఆపరేషన్.. ఏడేళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమీ ఆపరేషన్

గాంధీ దవాఖానలో అరుదైన ఆపరేషన్.. ఏడేళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమీ ఆపరేషన్
  • కిలోకు పైగా బరువున్న ప్లీహం తొలగింపు

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ దవాఖానలో తొలిసారిగా ఏడేళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ విధానంలో ప్లీహం తొలగించే ఆపరేషన్​ను డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్,హెచ్‌‌‌‌వోడీ డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ శస్త్ర చికిత్స జరిగింది. మంచిర్యాల జిల్లా అకినేపల్లి గ్రామానికి చెందిన సూర అఖిల్(7) పుట్టకతోనే రక్తవ్యాధి హెరిడిటరీ స్ఫీరోసైటోసిస్​ తో బాధపడుతున్నాడు. మూడు నెలల వయసు నుంచే వ్యాధి లక్షణాలు కనిపించాయి. 

ప్లీహం పెరగడం, జాండీస్​, తీవ్ర రక్తహీనతతో బాధపడుతుండగా, ప్రతీ వారం రక్త మార్పిడి అవసరమయ్యేది. ల్యాపరోస్కోపిక్ స్ప్లీనెక్టమీ చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స. రక్తస్రావం ప్రమాదం ఎక్కువగా ఉండడం, ఓపెన్ సర్జరీకి మార్చాల్సిన పరిస్థితులు రావడం, ఖర్చులు అధికం కావడం వంటి కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా ఇది అరుదుగానే చేస్తారు.

బాధితుడి తండ్రి రవి గాంధీ దవాఖానలో తన కొడుకును అడ్మిట్​ చేశారు. క్లిష్టమైన ఓపెన్​ సర్జరీ కాకుండా, డాక్టర్లు ల్యాపరోస్కోపిక్​ విధానంలో కడుపుకు నాలుగు చోట్ల రంధ్రాలు చేసి, అందులోనుంచి ప్లీహాన్ని చిన్న ముక్కలుగా చేసి బయటకు తీశారు. వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లకుండా వ్యాక్సిన్లు వేశారు. ఈ నెల 6న సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు.

శస్త్ర చికిత్సలో డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ పవన్ రావు, డాక్టర్ అశ్రిత్ రెడ్డి, డాక్టర్ హర్ష, డాక్టర్ సాజిద్ పాల్గొన్నారు. అనస్తీషియా విభాగం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ అవుల మురళి, డాక్టర్ బబిత కీలక సహకారం అందించారు. రూ.10 లక్షలకు పైగా ఖర్చయ్యే ఆపరేషన్​ను పైసా ఖర్చు లేకుండా విజయవంతంగా పూర్తిచేశామని గాంధీ  సూపరింటెండెంట్​ డాక్టర్​ వాణి తెలిపారు.