
- ఫ్రీగా ట్రీట్మెంట్ చేసిన నిమ్స్ డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డాక్టర్లు అరుదైన సర్జరీ చేసి విజయవంతమయ్యారు. కరీంనగర్ జిల్లాకు కోహెడ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన శివ ప్రసాద్ దీర్ఘకాలిక థ్రోంబోఎంబాలిక్ పల్మనరీ హైపర్‌టెన్షన్ (సీటీఈపీహెచ్), తీవ్రమైన ట్రైకస్పిడ్ రిసర్జిటేషన్‌తో బాధపడుతున్నాడు. ఈ వ్యాధుల కారణంగా ఊపిరితిత్తుల ధమనులలో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, గుండె వాల్వ్ లీకేజీ సమస్యలు తలెత్తాయి.
జులై 2న నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ అమరేశ్ పర్యవేక్షణలో, అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్య సత్య గోపాల్ నేతృత్వంలోని టీమ్.. పల్మనరీ ఎండార్టెరెక్టమీ ద్వారా శివప్రసాద్ ఊపిరితిత్తుల ధమనులలో రక్త గడ్డలను తొలగించి, ట్రైకస్పిడ్ వాల్వ్‌ను హార్డ్ ఫెల్ట్ ఉపయోగించి రిపేర్ చేసింది. ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స తర్వాత రోగి పూర్తిగా కోలుకున్నాడని, త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు.
నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప మాట్లాడుతూ.. ఇటీవల ఆరు అరుదైన పల్మనరీ ఎండార్టెరెక్టమీ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ సర్జరీలు ఒక్కొక్కటి రూ. 6 లక్షల ఖర్చు అవుతుందని..కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచితంగా అందించామని తెలిపారు. సర్జరీని విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ల బృందాన్ని ఆయన అభినందించారు.