మహిళా సర్పంచ్ ని తిట్టిన రసమయి

మహిళా సర్పంచ్ ని తిట్టిన రసమయి

బెజ్జంకి, వెలుగు: స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఆదివారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుండారం గ్రామసర్పం చ్ శెట్టి లావణ్యను దుర్భాషలాడడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన మరొకరి చేత ఆరుగురు దరఖాస్తుదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయించారు. అక్కడే ఉన్న సర్పంచ్ లావణ్య కల్పించుకుని ‘కనీసం ప్రొటోకాల్ పాటించకుండా నేను ఇక్కడే ఉండగా, వేరొకరి చేత చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని’ ప్రశ్నించారు. ఎమ్మెల్యే రసమయి ఒకింత ఆగ్రహంతో ఊగిపోతూ ‘చదువుకున్న వాళ్ల ద్వారా ఇప్పించాను, నువ్వు రాక్షసిలా మాట్లాడకు’ అంటూ అసహనం వ్యక్తంచేశారు.

‘నేను చదువుకున్న మహిళలా కనిపిం చట్లేదా ?’ అంటూ సదరు మహిళా సర్పంచ్ కన్నీటి పర్యంతమయ్యారు. విలేకరుల ఎదుట గోడు వెలిబుచ్చారు. ఎమ్మెల్యే గ్రామంలో టీఆర్ఎస్ పార్టీని విభజించి పాలిస్తున్నారని, తాను ఒక మహిళ సర్పంచ్ నని, తాను ఇక్కడే ఉండగా కనీసం ప్రొటోకాల్ పాటించకుండా బయటి వ్యక్తుల చేత ఎలా పంపిణీ చేయిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తీరును ఆమె ఖండించారు. భవిష్యత్ లో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని సర్పంచ్ లావణ్య హెచ్చరించారు. ఇదిలాఉండగా, మొన్న జరిగిన సింగిల్ విండో డైరెక్టర్లు, చైర్మన్ ఎన్నికల్లో తన మార్కు కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆగ్రహంతో ఉన్నట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు.