Rashmika: 'మనుషుల్లా ప్రవర్తించని వారికి కఠిన శిక్ష పడాలి'.. AI దుర్వినియోగంపై రష్మిక ఫైర్!

Rashmika: 'మనుషుల్లా ప్రవర్తించని వారికి కఠిన శిక్ష పడాలి'.. AI దుర్వినియోగంపై రష్మిక ఫైర్!

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. అయితే ఈ సాంకేతికతను అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఇది పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన 'డీప్‌ఫేక్' (Deepfake) కంటెంట్‌ను సృష్టిస్తూ అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు.  ఇప్పుడు ఇది సమాజంలో ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంపై సినీ సెలబ్రిటీలు తమ గళాన్ని విప్పుతున్నారు. లేటెస్ట్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి వారికి కఠినమైన శిక్షించాలి..

AI దుర్వినియోగానికి వ్యతిరేకంగా రష్మిక మందన్నా చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  "సత్యాన్ని కూడా సృష్టించగలిగినప్పుడు, విచక్షణే మనకు గొప్ప రక్షణా కవచం మారుతుంది. AI అనేది అభివృద్ధికి ఊతం లాంటిది. కానీ, మహిళలను లక్ష్యంగా చేసుకుని దీనిని దుర్వినియోగం చేస్తుండటం కొంతమంది వ్యక్తులలో నైతిక క్షీణతను సూచిస్తుంది. ఇంటర్నెట్‌ అనేది నిజానికి అద్దం లాంటిది కాదు, అది ఏదైనా వక్రీకరించగలిగే కాన్వాస్‌ అని గుర్తుంచుకోండి అని పోస్ట్ చేసింది. గౌరవప్రదంగా సమాజానికి ఉపయోగపడేలా AIని వినియోగించాలి. దుర్వినియోగం చేయోద్దు.  మనుషుల్లా వ్యవహరించని వారిని మరింత కఠినంగా, క్షమించరాని శిక్షలు విధించాలి అని కోరారు.ఈ పోస్ట్‌లో రష్మిక సైబర్ దోస్త్ (Cyber Dost) అధికారిక ఖాతాను ట్యాగ్ చేసింది.

 

సెలబ్రిటీలపై డీప్‌ఫేక్ దాడి

AI టెక్నాలజీతో సెలబ్రిటీల ముఖాలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. మంచి పనుల కోసం ఉపయోగించాల్సిన ఈ టెక్నాలజీని, కొందరు పైశాచిక ఆనందం కోసం దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవల నటి కీర్తి సురేశ్ కూడా తన డీప్‌ఫేక్ ఫోటోను చూసి షాక్‌కు గురైనట్లు తెలిపింది. AI ఒక రకంగా వరమైనా, మరో కోణంలో శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, బాలీవుడ్ నటి గిరిజా ఓక్‌ (Girija Oak) కూడా తన ఫోటోలు మార్ఫింగ్ అవడంపై తీవ్రంగా స్పందించారు.

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సవాళ్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడేవారిపై ప్రభుత్వం, సైబర్ సెల్ కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళల గౌరవాన్ని కాపాడాలని సినీ ప్రముఖులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రష్మిక చేసిన ప్రకటనకు నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.