హ్మ్​.. మళ్లీ విజయ్‌‌తో రష్మిక

హ్మ్​.. మళ్లీ విజయ్‌‌తో రష్మిక

విజయ్‌‌ దేవరకొండ, రష్మిక కాంబినేషన్‌‌కు అంటూ ఓ స్పెషల్‌‌ క్రేజ్ ఉంది. ‘గీత గోవిందం’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ జంట ఆ తర్వాత ‘డియర్‌‌‌‌ కామ్రేడ్‌‌’తో అభిమానులను ఆకట్టుకుంది. ఇక రియల్‌‌ లైఫ్‌‌లోనూ వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వచ్చే గాసిప్స్‌‌ సంగతి సరేసరి.  ఈ నేపథ్యంలో మరోసారి ఈ జంట కలిసి నటించబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. విజయ్ హీరోగా రాహుల్‌‌ సంకృత్యయన్‌‌ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది.  ‘టాక్సీవాలా’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌‌లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 

ఇందులో హీరోయిన్‌‌గా రష్మిక నటించబోతోంది. ఇందుకు సంబంధించి శనివారం ఓ హింట్ ఇచ్చారు. ‘హమ్..మ్..మ్‌‌.. లెట్స్‌‌ సీ’ అనే హ్యాష్‌‌ ట్యాగ్‌‌ను మైత్రి మూవీస్‌‌, దర్శకుడు రాహుల్‌‌ సంకృత్యయన్‌‌.. హీరోయిన్‌‌ రష్మికకు ట్యాగ్‌‌ ఇవ్వగా.. ఆమె కూడా అవును నిజమే అన్నట్టుగా హమ్..మ్..మ్‌‌.. అంటూ రిప్లై ఇచ్చింది. ఈ హ్యాష్‌‌ ట్యాగ్‌‌కు సినిమా టైటిల్‌‌కు ఏమైనా సంబంధం ఉందా లేక మరేదైనా అనేది తెలియాల్సి ఉంది. 

18వ శతాబ్ధం నాటి రియల్‌‌ ఇన్సిడెంట్స్‌‌ నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ ఇదని తెలుస్తోంది. ఇక తెలుగులో ధనుష్‌‌ ‘కుబేర’తో పాటు ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియంటెడ్‌‌ సినిమాలో నటిస్తున్న రష్మిక..  హిందీలో ‘తామా’ అనే హారర్ థ్రిల్లర్‌‌‌‌లో నటిస్తోంది.