ట్రంప్ టారిఫ్‎ల ఎఫెక్ట్‎తో అమెరికాలో రేట్లు పెరిగినయ్..బట్టలు, బ్యాగుల ధరలు భగ్గుమంటున్నయ్

ట్రంప్ టారిఫ్‎ల ఎఫెక్ట్‎తో అమెరికాలో రేట్లు పెరిగినయ్..బట్టలు, బ్యాగుల ధరలు భగ్గుమంటున్నయ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‎ల కారణంగా బట్టలు, బ్యాగుల ధరలు భారీగా పెరిగాయని ఆ దేశానికి చెందిన ఇన్​స్టాగ్రామ్ యూజర్ మెర్సిడెస్ చాండ్లర్ విమర్శించింది. టారిఫ్ విధించకముందు వాల్​మార్ట్‎లో బట్టల రేటు ఎంత ఉంది..? టారిఫ్ తర్వాత ఎంతకు పెరిగిందన్న దానిపై షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కొన్ని గంటల్లోనే 30 లక్షల మందికిపైగా ఈ వీడియోను చూశారు. వాల్​మార్ట్ స్టోర్‎కు వెళ్లిన చాండ్లర్.. పెద్దల షర్టులు, పిల్లలు వేసుకునే బట్టలు, బ్యాగులను పరిశీలించారు. వాల్​మార్ట్ సిబ్బంది పాత ట్యాగ్‎లను కవర్ చేస్తూ కొత్త స్టిక్కర్లు వేశారు. 

కొన్నింటిపై పాత ట్యాగ్‎లు కనిపిస్తున్నాయి. టారిఫ్ విధించకముందు షర్ట్ ధర రూ.960 ఉంటే.. అది రూ.1,050కు పెరిగింది. చిన్న పిల్లల షర్ట్ ఏకంగా రూ.611 నుంచి రూ.960కు పెరిగింది. ట్రావెల్ బ్యాగ్ ధర రూ.1,748 నుంచి ఏకంగా రూ.2,186కు హైక్ అయింది. ఈ వీడియోకు ‘‘డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌‌‌‌లు జోరుగా సాగుతున్నాయి’’అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. “ఇది విలువైనదేనా? మనం ఇప్పటికీ గొప్పగా ఉన్నామా?” అని ఓ యూజర్ అంటే.. మరో యూజర్, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంపై ఎద్దేవా చేశారు. “టారిఫ్‌‌‌‌ల ద్వారా అమెరికాకు బిలియన్ల డాలర్లు వస్తున్నాయి, దానికి బదులుగా షర్ట్‌‌‌‌కు ఒక డాలర్ ఎక్కువ చెల్లించాలి” అని మరో యూజర్ అన్నాడు.