ఉక్రెయిన్ నుంచి నిలిచిపోయిన సన్ ఫ్లవర్ దిగుమతులు

ఉక్రెయిన్ నుంచి నిలిచిపోయిన సన్ ఫ్లవర్ దిగుమతులు
  • ఇప్పటికే లీటర్ పై రూ.20 నుంచి 25 పెంపు
  • ఉక్రెయిన్ నుంచి నిలిచిపోయిన సన్​ ఫ్లవర్ దిగుమతులు 
  •  ఆ దేశం నుంచే దాదాపు  90 శాతం సప్లయ్ 
  • చాలా చోట్ల ‘ఆయిల్ నో స్టాక్’ బోర్డులు

హైదరాబాద్, వెలుగు: వంట నూనెల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాతి నుంచి.. ఉక్రెయిన్​ నుంచి మన దేశానికి రావాల్సిన సన్​ ఫ్లవర్ దిగుమతులు పూర్తిగా నిలిచి పోయాయి.  దీంతో 10 రోజుల నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. సిటీలో హోల్ సేల్ మార్కెట్​లో 12 రోజుల కిందట లీటర్ రూ.138 ఉండగా.. ప్రస్తుతం రూ.160కి పెరిగింది. ఇక రిటైల్​లో రూ.172కిపైగా ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే వారం లోగా రూ.200 దాటే అవకాశం ఉంది. మనం వాడుతున్న సన్ ఫ్లవర్ ఆయిల్​లో 80 నుంచి 90 శాతం ఉక్రెయిన్ నుంచే వస్తోంది. ఇంకొంత ఆస్ర్టేలియా, రష్యాల నుంచి దిగమతి అవుతుండగా.. మన దగ్గర 5 శాతం లోపే ఉత్పత్తి అవుతోంది.ప్రస్తుతం సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు మాత్రమే నిలిచిపోయినప్పటికీ, ఆ ప్రభావం మిగతా నూనెలపైనా పడింది. అన్ని రకాల నూనెల రేటు దాదాపు రూ.20 నుంచి రూ.25 వరకు పెరిగింది. ఇంకా పెరిగే చాన్స్ ఉంది. ప్రభుత్వం అమ్ముతున్న విజయ నూనెల రేటు కూడా పెరిగింది.  సన్ ఫ్లవర్ ఆయిల్ కొరత ఉండడంతో మిగతా వాటికి కూడా డిమాండ్ పెరిగిందని, అందుకే రేట్లు పెరిగాయని ఆయిల్ అసోసియేషన్ పేర్కొంది. 

నో స్టాక్ బోర్డులు.. 

రేట్లు మరింత పెరుగుతాయని ప్రచారం జరుగుతుండడంతో జనం లీటర్ల కొద్ది నూనె కొని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలాచోట్ల ‘ ఆయిల్ నో స్టాక్’ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని కంపెనీల ఆయిల్ స్టాక్ ఉన్నప్పటికీ, బ్లాక్ చేస్తుండటంతో షార్టేజీ ఏర్పడుతోంది. రేట్లు పెరగడానికి ఇది కూడా కారణమైంది. రష్యా,-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే యుద్ధం ఆగిన కూడా వెంటనే నూనె దిగుమతులు మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతమున్న స్టాక్ నెల రోజులకు సరిపడా ఉన్నప్పటికీ, కొందరు బ్లాక్ చేస్తుండడంతోనే ‘నో స్టాక్’ ప్రచారం జరుగుతోంది. కాగా, మన రాష్ట్రంలో అన్ని రకాల నూనెలు కలిపి రోజూ 2,500 టన్నులు అవసరముంది. ఇందులో 1,500 టన్నులు సన్ ఫ్లవర్ ఆయిలే వాడుతున్నారు. మిగతావి పామాయిల్, పల్లి, సోయా, రైస్‌‌ బ్రాన్‌‌ తదితర నూనెలు ఉన్నాయి. 

మన దగ్గరే ఉత్పత్తులు పెంచాలే.. 

లీటర్‌‌‌‌ నూనె రూ.200 దాటేలా ఉంది. ఇలాంటి పరిస్థితులు రావొద్దంటే, విదేశాలపై ఆధారపడకుండా మన దగ్గరే ఉత్పత్తులు పెంచాలి. దీనికి ఐదారేండ్ల టైమ్‌‌ పడుతుంది. తప్పని పరిస్థితుల్లోనే రేట్లు పెంచాల్సి వచ్చింది. యుద్ధం బంద్‌‌ అయినా వెంటనే దిగుమతులు కావు. అప్పటి వరకు రేట్లు తగ్గవు. 
- వెంకటేశ్వర్ రెడ్డి, విజయ కంపెనీ మేనేజర్‌‌‌‌

యుద్ధం ఆగితేనే.. 

యుద్ధం ఆగే వరకు నూనె దిగుమతి అయ్యే అవకాశం లేదు. స్టాక్‌‌ అయిపోతుండడంతో రేట్లు పెరుగుతున్నాయి. మళ్లీ దిగుమతులు మొదలయ్యే వరకు రేట్లు పెరుగుతూనే ఉంటాయి. 
- విశ్వనాథ్, హైదరాబాద్‌‌ ఆయిల్ అసోసియేషన్‌‌ మెంబర్

బ్లాక్‌‌ చేస్తే చర్యలు.. .

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా స్టాక్‌‌ను బ్లాక్‌‌ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో జనం ఇబ్బందులు పడకుండా చూస్తాం.
- రమేశ్‌‌, డీఎస్​వో, హైదరాబాద్