జూన్ మొదటి వారం నుంచి..రేషన్​కార్డుల దరఖాస్తుల పరిశీలన

జూన్ మొదటి వారం నుంచి..రేషన్​కార్డుల దరఖాస్తుల పరిశీలన
  • ప్రస్తుతం మార్పులు, చేర్పులు కొనసాగిస్తున్న అధికారులు
  • ఇప్పటి వరకు 4 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడి
  • సిబ్బంది రాగానే ప్రక్రియ షురూ

హైదరాబాద్​సిటీ, వెలుగు: కొత్త రేషన్​కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వుంది. దరఖాస్తు చేసుకున్న వారంతా ఎప్పుడు తమకు కార్డులు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. కానీ, దరఖాస్తుల పరిశీలన కూడా మొదలుకాకపోవడంతో కొత్త రేషన్​కార్డుల ఎప్పుడు ఇస్తారంటూ అంతా సర్కిల్​ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, తాజాగా జూన్​మొదటి వారంలో కొత్త రేషన్​కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్​మొదలుపెట్టనున్నట్టు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. భారీ సంఖ్యలో వస్తున్న దరఖాస్తులు.. పరిశీలనకు పెద్ద అడ్డంకిగా మారిందన్నారు. 

వెరిఫికేషన్​కు సిబ్బంది లేరు 

నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం 6,39,451 రేషన్​కార్డులున్నాయి. తాజాగా దాదాపు 4 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. చాలా మంది రెండు, మూడుసార్లు దరఖాస్తు చేసుకుంటున్నారని అంటున్నారు. బల్దియా, కలెక్టరేట్​ప్రజావాణితో పాటు, ఈసేవ ద్వారా ఇంకా అప్లికేషన్లు పెట్టుకుంటూనే ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. వీటి వెరిఫికేషన్​కు ప్రస్తుతం సీఆర్ఓ  పరిధిలో అవసరమైనంత మేరకు సిబ్బంది లేరని అధికారులు చెప్తున్నారు. అందుకే సిబ్బంది కావాలంటూ రెవెన్యూ, బల్దియాలకు లెటర్లు రాశామంటున్నారు. 

ఈ నెలాఖరులో ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై సిబ్బంది వచ్చే అవకాశం ఉందని, వారు రాగానే జూన్​మొదటి వారం నుంచి  రేషన్​కార్డుల వెరిఫికేషన్, ఇంటింటి తనిఖీ చేస్తామని చెప్తున్నారు. అర్హుల గుర్తింపు తర్వాత కొత్త కార్డుల జారీ మొదలవుతుందన్నారు. అప్పటివరకు ఉన్న స్టాఫ్​తో కొత్త సభ్యుల చేర్పు, చనిపోయిన వారు, అనర్హుల తొలగింపు కార్యక్రమం చేపడుతున్నట్టు అధికారుల వెల్లడించారు. మరోవైపు రేషన్​కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు అంటూ ఏమీ లేదని నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని వెల్లడించారు.