ఫ్లైట్ టికెట్ల పేరుతో ట్రావెట్​ ఏజెంట్ మోసం.. పోలీసులకు బాధిత స్టూడెంట్ల ఫిర్యాదు

ఫ్లైట్ టికెట్ల పేరుతో ట్రావెట్​ ఏజెంట్ మోసం.. పోలీసులకు బాధిత స్టూడెంట్ల ఫిర్యాదు

బషీర్​బాగ్, వెలుగు: ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్తున్న పలువురు స్టూడెంట్లను ఓ ట్రావెల్ ఏజెంట్ మోసగించాడు. ఫ్లైట్ టికెట్ల కోసం రూ.లక్షల్లో డబ్బులు చెల్లించిన బాధిత స్టూడెంట్లు అబిడ్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్​స్పెక్టర్  నరసింహారాజు తెలిపిన మేరకు ... సిటీకి చెందిన పలువురు స్టూడెంట్లు అమెరికా వెళ్లేందుకు బషీర్​బాగ్ లోని లతీఫ్ ఖాన్ బిల్డింగ్​లోని కార్పొరేట్ సొల్యూషన్ ట్రావెల్స్ ఏజెన్సీని సంప్రదించారు. 

టికెట్ చార్జీల పేరిట ఏడుగురి నుంచి  రూ.1 లక్ష 25 వేలు, రూ. 1 లక్ష 75 వేల చొప్పున ట్రావెల్ ఏజెన్సీ ఓనర్ మహ్మద్ అబ్దుల్ ఖయ్యూం వసూలు చేశాడు. టికెట్లను వారికి ఇచ్చి పంపించాడు. ఈ నెల15న ఫ్లైట్ ఉండగా ట్రావెల్ ఓనర్ వారికి ఫోన్ చేసి టికెట్లు క్యాన్సల్ అయ్యాయని, మళ్లీ బుక్ చేస్తానని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు.  అనుమానం వచ్చిన స్టూడెంట్లు ఎంక్వయిరీ చేయడంతో అవి ఫేక్ టికెట్లుగా తేలింది. దీనితో బాధితులు ట్రావెల్ ఏజెన్సీకి వెళ్లగా బంద్ చేసి ఉంది. మోసపోయామని బాధిత స్టూడెంట్లు పాషా మసిఉద్దీన్ , మహ్మద్ అలీ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఇన్ స్పెక్టర్ తెలిపారు.