తమిళ స్టార్ హీరో జయం రవి (రవీ మోహన్) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరతే బాబు’(Karathey Babu). ‘దాదా’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కె. బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ‘JR 34’ లేదా ‘RM 34’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించగా, తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ ద్వారా అధికారిక పేరును ఖరారు చేశారు.
టీజర్‌ను గమనిస్తే, ఈ సినిమా శక్తివంతమైన రాజకీయ కథాంశంతో తెరకెక్కుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. జయం రవి ఈ చిత్రంలో చెన్నై ఆర్‌కే నగర్ ఎమ్మెల్యే పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన టీజర్‌లో తమిళనాడు శాసనసభలో జరిగే కీలక చర్చలు, రాజకీయ నేతల మధ్య వాదనలు, ఎత్తులకు పైఎత్తులు, వెన్నుపోటు రాజకీయాలు వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. హీరో జయం రవి చుట్టూ నడిచే రాజకీయ పరిణామాలు సినిమాపై ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.
దీనికి తోడు సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండగా, ఎజిల్ అరసు సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా సినిమాకు అదనపు బలాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ‘కరతే బాబు’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. అయితే, చిత్ర విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
బలమైన తారాగణం..
ఈ చిత్రంలో దౌదీ ఎస్. జివాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శక్తి వాసుదేవన్, కె.ఎస్. రవికుమార్, నాసర్, వి.టి.వి గణేష్, సుబ్రమణియం శివ, కవితాలయ కృష్ణన్, ప్రదీప్ ఆంటోనీ, రాజా రాణి పాండియన్, సందీప్ రాజ్, నైఫ్ నరేన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ తారాగణం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
రవీ మోహన్ అప్ కమింగ్ మూవీస్..
రవీ మోహన్ ఇటీవల నటించిన ‘కాదలిక్క నేరమిల్లై’ (దర్శకురాలు: కిరుతిగా ఉదయనిధి) పొంగల్ సందర్భంగా విడుదలై మిశ్రమ స్పందన పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సగటు వసూళ్లు సాధించగా, త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. రవీ మోహన్ లైనప్‌లో ‘జీనీ’, ‘SK25’, ‘తని ఒరువన్ 2’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా మరిన్ని ఆసక్తికర సినిమాలను సైన్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
