టీమిండియా ఓటమికి ఓవర్ కాన్ఫిడెన్సే కారణం :రవిశాస్త్రి

టీమిండియా ఓటమికి ఓవర్ కాన్ఫిడెన్సే  కారణం :రవిశాస్త్రి

మూడో టెస్టులో ఓటమి పాలైన టీమిండియా ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి టీమిండియాపై మండిపడ్డాడు. భారత ఓటమికి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్,అతి నమ్మకమే అని చెప్పాడు. తొలి రెండు టెస్టుల్లో గెలవడంతో ఆటగాళ్ల కళ్లు నెత్తికెక్కాయని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆస్ట్రేలియాను తేలిగ్గా తీసుకుని మూల్యం చెల్లించుకున్నారని విమర్శించాడు.   

గుణపాఠం నేర్చుకోవాలి..

మూడో టెస్టు ఓటమిని టీమిండియా సమీక్షించుకోవాలని రవిశాస్త్రి సూచించాడు. ఎక్కడ తప్పు జరిగిందో వాటిని సరిదిద్దుకోవాలన్నాడు. ఈ ఓటమి టీమిండియా ఆటగాళ్ల గర్వాన్ని నేలకు దించిందన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మన్ ఆడిన తీరు చూస్తే అర్థమవుతుందన్నాడు. కఠిన పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఆడి ఔటయ్యారని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా ఓటమికి గల కారణాలను సమీక్షించుకుని నాల్గో టెస్టులో టీమిండియా బరిలోకి దిగాలని రవిశాస్త్రి సూచించాడు. 

ఓటమి..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్లో  ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 34 ఓవర్లలోనే 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా197 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు భారత్ 75 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.  75 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఒక వికెట్ కోల్పోయి  చేధించింది.