ఫాంలో లేకపోతే విశ్రాంతి తీసుకోవడం మంచిది:రవిశాస్త్రి

ఫాంలో లేకపోతే విశ్రాంతి తీసుకోవడం మంచిది:రవిశాస్త్రి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0తో  క్లీన్ స్వీప్ చేస్తే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ను కూడా సాధిస్తుందని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే ఇంగ్లాండ్లో పరిస్థితులు ఆస్ట్రేలియా అనుకూలంగా ఉన్నా కూడా...బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందన్నాడు. 

అలాగైతే టైటిల్ భారత్ దే..

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే టీమిండియా వరుసగా రెండు టెస్టుల్లో గెలిచింది. మరో మ్యాచ్‌లో విజయం సాధించినా..లేదా చివరి రెండు టెస్ట్‌లను డ్రా చేసుకున్నా టీమిండియాకు WTC ఫైనల్‌ బెర్త్ ఖరారు అవుతుంది. ఈ  నేపథ్యంలో WTC టైటిల్ పై రవిశాస్త్రి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ -గవాస్కర్‌ ట్రోఫీని భారత జట్టు 4-0 తేడాతో గెలిస్తే WTC ఫైనల్లోనూ ఆసీస్‌తో తలపడినా భారతే గెలుస్తుంది చెప్పుకొచ్చాడు. 

వైస్ కెప్టెన్ అవసరం లేదు..

మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్కు టీమిండియాకు వైస్ కెప్టెన్ అవసరం లేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వైస్ కెప్టెన్ సరిగా ఆడకపోతే..అతని స్థానంలో మరో వ్యక్తిని తీసుకోవచ్చన్నాడు. అయితే ఇది స్వదేశానికే పరిమితమని..విదేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నాడు. ప్రస్తుతం భారత్ కు మంచి ఫాంలో ఉన్న గిల్ లాంటి ఆటగాడు కావాలన్నాడు. గిల్ అయితే ప్రత్యర్థికి సవాలు విసరగలుగుతాడని చెప్పాడు. అయితే తుది జట్టులో ఎవరుండాలి అనే నిర్ణయం టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంటుందని వివరించాడు. 

ఫాంలో లేకపోతే విశ్రాంతి తీసుకోవాలి..

టీమిండియాలో టాలెంట్ ఉన్న ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని రవిశాస్త్రి తెలిపాడు. అయితే జట్టులో కొనసాగాలంటే మాత్రం రాణించక తప్పదన్నాడు. ఫాంలో లేకపోతే ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. వాళ్ల బలహీనతలు తెలుసుకుని పుంజుకుని తిరిగి జట్టులోకి రావడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాను కోచ్ గా ఉన్న సమయంలో పూజారా, కేఎల్ రాహుల్ లను తప్పించామని..అయితే వారు  రాణించి జట్టులోకి తిరిగొచ్చాడని గుర్తు చేశాడు.