లొల్లి వద్దు.. సెటిల్ చేసుకోండి .. టీఎన్జీవో నేతలకు రవీందర్ రెడ్డి, దేవి ప్రసాద్ సూచన

లొల్లి వద్దు.. సెటిల్ చేసుకోండి .. టీఎన్జీవో నేతలకు  రవీందర్ రెడ్డి, దేవి ప్రసాద్ సూచన

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీఎన్జీవో)లో నెలకొన్న పంచాయతీ తెగట్లేదు. జనరల్ సెక్రటరీ పదవి విషయంలో మొదలైన లొల్లి కోర్టు దాకా వెళ్లడంతో.. సంఘం మాజీ అధ్యక్షులు రంగంలోకి దిగారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల మీటింగ్ మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. నేతల మధ్య ఏకాభిప్రాయం తేచ్చేందుకు, వారికి నచ్చచెప్పేందుకు టీఎన్జీవో మాజీ అధ్యక్షులు దేవీ ప్రసాద్, కారం రవీందర్ రెడ్డి ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.

కోర్టు తీర్పుకు ముందే వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని వారు నచ్చజెప్పినట్లు సమాచారం. “కోర్టు నుంచి తీర్పు వస్తే యూనియన్ వివాదం బయట పడుతుంది. అంతకుముందే సెటిల్ చేసుకోండి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న టీఎన్జీవో.. కోర్టుల వరకు ఎప్పుడూ వెళ్లకుండా క్రమశిక్షణతో సాగింది. ఇప్పుడు లొల్లి వద్దు” అని వారు చెప్పినట్లు తెలిసింది. అయితే జిల్లాల అధ్యక్షులు మాత్రం అందుకు అంగీకరించలేదని సమాచారం. తనకు జనరల్ సెక్రటరీ పోస్టు ఇస్తే కేసును విత్ డ్రా చేసుకుంటానని మాజీ జనరల్ సెక్రటరీ రాయకంటి  ప్రతాప్ చెప్పినట్లు తెలుస్తున్నది.

ఇదీ వివాదం

టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న మామిళ్ల రాజేందర్.. బీఆర్ఎస్ లో చేరటంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. అంతకుముందు జనరల్ సెక్రటరీగా ఉన్న రాయకంటి ప్రతాప్‌ను తొలగించి, ఎన్నిక నిర్వహించి మారం జగదీశ్వర్‌‌ను కొత్త జీఎస్‌గా ఎన్నుకున్నారు. అయితే జీఎస్ ఎన్నిక రూల్స్ ప్రకారం జరగలేదంటూ కోర్టును ప్రతాప్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జీఎస్ ఎన్నికపై సిటీ సివిల్ కోర్టు  స్టే ఇచ్చింది. వచ్చే నెల 3న కోర్టు తీర్పు వెల్లడించనుంది.

పదవుల కోసం ఫుల్ డిమాండ్

రాష్ట్రంలో ఉన్న సుమారు 70 వేల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రతినిధిగా టీఎన్జీవో సంఘం కొనసాగుతున్నది. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పదవులు చాలా కీలకం. ఉద్యోగుల సమస్యలపై సీఎం, మంత్రులను నేరుగా కలిసే యాక్సెస్ ఉంటుంది. దీంతో ఈ పదవుల కోసం భారీగా పోటీ నెలకొంది. వచ్చే 2, 3 ఏళ్లలో రిటైర్ అయ్యే పలువురు జిల్లా అధ్యక్షులు ప్రెసిడెంట్, జీఎస్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు.