
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తన పసిడి నిల్వలను గణనీయంగా పెంచుకున్నది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి, ప్రపంచ అనిశ్చితుల నుంచి రక్షించడానికి ఒక వ్యూహాత్మక చర్య. జూన్ 27తో ముగిసిన వారంనాటికి ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వలు 879.98 టన్నులకు చేరాయి. ఈ వారం 400 కిలోగ్రాముల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసినట్లు నెలవారీ బులెటిన్ వెల్లడించింది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న పిసిడి నిల్వల విలువ సుమారు 84.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ.7.26 లక్షల కోట్లు). ఇది మన దేశ విదేశీ మారకపు నిల్వల్లో 12శాతం వాటాను కలిగి ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వాటా పెరుగుతూ వస్తోంది. ఇది అమెరికా ట్రెజరీలపై, ఇతర ఫియట్ కరెన్సీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఆర్బీఐ వ్యూహాన్ని సూచిస్తున్నది.
బంగారం నిల్వలకు కారణాలు
కొవిడ్–19 మహమ్మారి అనంతరం ప్రపంచం అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలను ఎదుర్కొంటున్నది. ఇలాంటి ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారం ఒక సురక్షిత ఆస్తిగా పనిచేస్తున్నది. అమెరికా డాలర్, ఇతర విదేశీ కరెన్సీల హెచ్చుతగ్గుల నుంచి భారతదేశ నిల్వలను కాపాడుతుంది. విదేశీ మారకపు నిల్వలను వైవిధ్యపరచడం ఆర్బీఐ ప్రధాన లక్ష్యం. బంగారం కలిగి ఉండటం బాహ్య ఒడుదొడుకులకు, ముఖ్యంగా వేగవంతమైన కరెన్సీ విలువ తగ్గడం లేదా ప్రపంచ రుణ నష్టాలకు గురికావడాన్ని తగ్గిస్తుంది.