
ఆర్బీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. అమాయకులకు మాయమాటలు చెప్పారు. భారీగా డబ్బులు దండుకున్నారు. చివరకు మోసం బయటపడి కటకటాలపాలయ్యారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేసిన ఇద్దరు కేటుగాళ్లను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారు మొరచిక్కం సంజీవయ్య అలియాస్ జీవయ్య, ఫిరోజ్ సులేమాన్‌గా గుర్తించారు. కిరణ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ. 8 లక్షల నగదు, ఏడు నకిలీ జాబ్ లెటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆర్‌బీఐలో క్లర్క్ , అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని..వాటిని ఇప్పిస్తామంటూ పలువురు మహిళలకు మొరచిక్కం సంజీవయ్య అలియాస్ జీవయ్య, ఫిరోజ్ సులేమాన్, కిరణ్ మాయమాటలు చెప్పారు. ఆర్బీఐలో తెలిసిన వాళ్లు ఉన్నారని..వారికి డబ్బులిస్తే పని అయిపోతుందని నమ్మబలికారు. మోసగాళ్ల మాయమాటలు నమ్మిన బాధితులు..వారికి భారీగా డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత జాబ్ వచ్చినట్లు నకిలీ లెటర్లను కూడా బాధిత మహిళలకు అందజేశారు.
అయితే ఆ లెటర్లు ఫేక్ అని తెలియడంతో బాధిత మహిళలు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..జులై 23వ తేదీ ఆదివారం సంజీవయ్య, ఫిరోజ్ ఖాన్‌లను అరెస్ట్ చేశారు.