
- రెపో రేటు 5.5 శాతం వద్ద కొనసాగింపు
- ద్రవ్యోల్బణం 3.1 శాతానికి దిగొస్తుందని అంచనా
- గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు అమెరికా కంటే ఇండియా నుంచే ఎక్కువ సపోర్ట్
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం: ఆర్‌బీఐ ఎంపీసీ
న్యూఢిల్లీ: వరుసగా మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), తాజా మీటింగ్‌లోనూ రేట్లను యదాతథంగా కొనసాగించేందుకు మొగ్గు చూపింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు, టారిఫ్‌ల అనిశ్చితుల నుంచి వచ్చే రిస్క్‌లను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ), రెపో రేటును 5.5శాతం వద్ద కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. 'న్యూట్రల్' వైఖరిని కొనసాగించింది.
సాధారణ వర్షపాతం, రాబోయే పండుగ సీజన్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని, అయితే గ్లోబల్ వాణిజ్య సవాళ్లు కొనసాగుతున్నాయని మల్హోత్రా వివరించారు. యూఎస్ టారిఫ్ చర్యల గురించి ఆయన నేరుగా మాట్లాడలేదు.
ఈ నెల 7 నుంచి భారత వస్తువులపై 25శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు బుధవారం మరో 25 శాతం టారిఫ్ కూడా వేశారు. దీంతో ఇండియాపై అమెరికా టారిఫ్ 50 శాతానికి పెరిగింది. ఈ టారిఫ్‌లకు అదనంగా పెనాల్టీ విధిస్తామని కూడా హెచ్చరించారు.
మరింత తగ్గనున్న ద్రవ్యోల్బణం
ప్రస్తుతం గ్లోబల్‌గా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నా, ఇండియా మాత్రం బలంగా ఉందని మల్హోత్రా అన్నారు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు అమెరికా కంటే ఇండియానే ఎక్కువ సపోర్ట్ ఇస్తోందని కామెంట్ చేశారు.
కాగా, ఈ ఏడాది మూడు ఎంపీసీ మీటింగ్‌లలో రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించగా, ఆ తర్వాత నుంచి రేట్ల కోతకు విరామం ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణ అంచనాను 3.7శాతం నుంచి 3.1శాతానికి ఆర్‌బీఐ ఎంపీసీ తగ్గించింది.
కానీ ఈ ఏడాది చివరిలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుందని హెచ్చరించింది. “కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ– రిటైల్ ఇన్‌ఫ్లేషన్) ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌లో 4శాతం పైన ఉంటుంది. కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌తో పోల్చడంతో బేస్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలానే పాలసీ చర్యల వలన డిమాండ్ సైడ్ కొన్ని అంశాల ప్రభావం ఉంటుంది” అని పేర్కొంది.
జీడీపీ 6.5 శాతం..
సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం జీడీపీ వృద్ధి అంచనాను 6.5శాతం వద్ద మార్పులేకుండా ఉంచింది. “గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ సవాళ్లతో ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉండడంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది” అని మల్హోత్రా వివరించారు.
ఇటీవల చేపట్టిన వడ్డీ రేట్ల కోతలు కన్జూమర్లకు బదిలీ అవుతున్నాయని అన్నారు. “భారత ఆర్థిక వ్యవస్థ గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇలాంటి టైమ్‌లో మానిటరీ పాలసీతో పాటు అన్ని రంగాల్లో బలమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్ అవసరం. ఆర్థిక డేటా ఆధారంగా మా నుంచి పాలసీ సపోర్ట్ ఉంటుంది”అని తెలిపారు.
యూపీఐని ఎల్లప్పుడూ ఫ్రీగా ఇవ్వలేం..
డిజిటల్ పేమెంట్స్‌లో కీలకంగా ఉన్న యూపీఐ సర్వీస్‌లను ఎల్లప్పుడూ ఫ్రీగా అందివ్వడం కుదరదని మల్హోత్రా కామెంట్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు నిలకడైన ఫండింగ్ మోడల్ అవసరమని సూచించారు.
యూపీఐ సర్వీస్‌లు అందివ్వడానికి ఖర్చులు అవుతాయని, ఎవరో ఒకరు భరించాలని ఎంపీసీ సమావేశం తర్వాత తెలిపారు. ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం, యూపీఐ భారత్‌లో 85శాతం, గ్లోబల్‌గా 60శాతం డిజిటల్ చెల్లింపులను నడిపిస్తోంది.
ఈ ఏడాది జూన్‌లో 1,839 కోట్ల లావాదేవీలతో రూ.24 లక్షల కోట్లను ప్రాసెస్ చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మర్చంట్లు, పేమెంట్ అగ్రిగేటర్లపై ఈ నెల 1 నుంచి ప్రాసెసింగ్ ఛార్జీని వేస్తోంది. ట్రాన్సాక్షన్‌పై గరిష్టంగా రూ.6 వసూలు చేస్తోంది.