
నవంబర్ 8, 2016 న డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) ప్రకటించేటప్పుడు జరిగిన బోర్డు మీటింగ్ లో కొంత మంది ఆర్ బీఐ డైరెక్టర్లు ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించలేదు. బ్లాక్‌మనీ అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దు సాయపడుతుందనే ప్రభుత్వ వాదనకు కొంత మంది డైరెక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది. అసలు పెద్ద నోట్ల రద్దు మీద ఆర్ బీఐ అభిప్రాయమేమిటి అనేది పూర్తిగా ఇప్పటికీ వెల్లడికాలేదు. ఐతే, పెద్ద నోట్ల రద్దు రోజున జరిగిన ఆర్ బీఐ మీటింగ్ మినిట్స్ చూస్తే కొంత అవగాహన కలుగుతుంది. బ్లాక్ మనీ కట్టడికి, ఫేక్ కరెన్సీ నిరోధానికి, ఎలక్ట్రానిక్ చెల్లింపులు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు దారి తీస్తుందని ప్రకటన రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పారు. దేశంలోని ప్రజలందరూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగం కావడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఐతే, ఆ రోజు సాయంత్రం (పెద్ద నోట్ల రద్దుకు ముందు) జరిగిన ఆర్ బీఐ బోర్డు సమావేశంలో కొంత మంది డైరెక్టర్లు మాత్రం ఈ అభిప్రాయంతో విభేదించారు. దేశంలోని బ్లాక్‌మనీలో అత్యధిక భాగం నగదు రూపంలో లేదని, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల రూపంలో ఉందని వారు ప్రస్తావించారు. పెద్ద నోట్ల రద్దు నేరుగా ఈ రంగాలలోని బ్లాక్ మనీ మీద ఎలాంటి ప్రభావం చూపించ లేదని వ్యాఖ్యానించారు.
ఆర్థిక వ్యవస్థ విస్తరణతో పోలిస్తే, పెద్ద నోట్ల చలామణీ ఎక్కువగా ఉందనే ప్రభుత్వ అభిప్రాయంతోనూ ఈ డైరెక్టర్లు ఏకీభవించలేదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, పెద్ద నోట్ల చలామణీ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. ఇక ఫేక్ కరెన్సీ విషయానికి వస్తే, మొత్తం చలామణీలోని కరెన్సీలో రూ. 400 కోట్ల ఫేక్ కరెన్సీ పెద్ద ఆందోళన కలిగించేది కాదని పేర్కొన్నారు. ఏమైనప్పటకీ, ఆ డైరెక్టర్లందరూ చివరకు ప్రభుత్వ ప్రతిపాదనను మాత్రం సమర్ధించారు. నిజానికి పెద్ద నోట్ల రద్దు అంశం మీద ఆర్ బీఐ, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఆరు నెలల పాటు చర్చలు సాగాయి. ఈ చర్చల సారాంశం ఇప్పటికీ బయటకు పొక్కలేదు. అధికారిక ఆర్థిక వ్యవస్థలో ప్రజలందరినీ భాగస్వాములు చేయడంతోపాటు, డిజిటల్ చెల్లింపుల పెరగడానికి సాయపడుతుందనే ఉద్దేశంతోనే ఆ డైరెక్టర్లు ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూ జన్ ప్రక్రియకు, పేమెంట్ విధానంలో ఎలక్ట్రిక్ మోడ్స్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్రతిపాదిత చర్యలు అతిపెద్ద అవకాశంగా ఉండనున్నాయని ఆర్ బీఐ డైరెక్టర్లు చెప్పారు. అయితే 2016-17 ఆర్థిక సంవత్సర జీడీపీకి స్వల్పకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్‌బీఐ డైరెక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు.