
- వీటిని చెల్లించేందుకు ప్రయత్నిస్తున్న ఆర్బీఐ
- ప్రజల్లో అవగాహన పెంచేందుకు అక్టోబర్-డిసెంబర్‌లో ప్రచార కార్యక్రమాలు
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఉన్న సుమారు రూ.67 వేల కోట్లకు పైగా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను అసలైన హక్కుదారులకు తిరిగి చెల్లించేందుకు బ్యాంకులు మరింత కృషి చేయాలని ఆర్‌బీఐ సూచించింది. పదేళ్లకు పైగా ఉపయోగించని సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, మెచ్యూర్ అయినా విత్‌డ్రా చేయని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, అలాగే వసూలు చేయని డివిడెండ్లు, వడ్డీ చెల్లింపులు, ఇన్సూరెన్స్ డబ్బులు వంటి వాటిని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పిలుస్తున్నారు. ఈ అకౌంట్ల యజమానులను గుర్తించి, డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టనుంది.
స్థానిక భాషల్లో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం జరుగుతుంది. బ్యాంకులు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించి వాటిని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏ) కి బదిలీ చేస్తాయి. ఈ డీఈఏ ఫండ్ ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ఉంటుంది. స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీస్ (ఎస్‌ఎల్‌బీసీ) ఈ డిపాజిట్ల డేటాను వయస్సు, ప్రొఫైల్ వారీగా విశ్లేషించి, ప్రత్యేకంగా గుర్తించి, స్థానిక స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం చేస్తాయి.
ఇక ప్రజలు తమకు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఏ బ్యాంకులో ఉన్నాయో తెలుసుకోవడానికి ఆర్‌బీఐ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్– గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ (యూడీజీఏఎం) అనే సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పోర్టల్‌లో సుమారు 30 బ్యాంకులు భాగస్వామ్యం అయ్యాయి. ఇవి మొత్తం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల విలువలో 90శాతం వరకు కవర్ చేస్తున్నాయి.
ఇన్సూరెన్స్ రంగంలోనూ ఇదే విధంగా..
ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఇదే విధానం ఉంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) ప్రకారం, పది సంవత్సరాలుగా విత్‌డ్రా చేయని ఇన్సూరెన్స్ డబ్బులు ప్రతి సంవత్సరం సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కి వడ్డీతో పాటు బదిలీ చేయాలి. అయితే, ఎస్‌సీడబ్ల్యూఎఫ్‌కి బదిలీ చేసిన తర్వాత కూడా, పాలసీహోల్డర్ లేదా క్లెయిమెంట్ 25 సంవత్సరాల వరకు తమ డబ్బును తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఎస్‌సీడబ్ల్యూఎఫ్ నిధిని సీనియర్ సిటిజెన్స్‌కు ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తారు.