నాలుగు నెలలుగా ఆర్సీ, లైసెన్స్​ కార్డులు ఆగినయ్

నాలుగు నెలలుగా ఆర్సీ, లైసెన్స్​ కార్డులు ఆగినయ్
  • రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా పెండింగ్‌
  •  స్టేషనరీ లేదంటున్న ఆర్టీవోలు
  • వాహనదారులకు ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: వాహనదారులకు రవాణా శాఖ కొన్ని నెలలుగా ఆర్సీ(రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌), డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు ఇస్తలేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షకు పైగా కార్డులు పెండింగ్​లో ఉన్నాయి. ఇదేంటని అడిగితే స్టేషనరీ లేకపోవడంతోనే కార్డులు ఇవ్వలేపోతున్నామని ఆర్టీవోలు, ఇతర అధికారులు అంటున్నారు. కార్డుల కోసం ముందే పైసలు కట్టించుకుంటున్నా, ఇన్​టైంలో ఇవ్వడం లేదంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
లక్షకుపైగా పెండింగ్
రాష్ర్టంలో56 ఆర్టీవో, యూనిట్ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి రోజు ఒక్కో ఆర్టీఏ ఆఫీస్​లో వందల సంఖ్యలో లైసెన్స్, ఆర్సీ కార్డులు జారీ చేస్తుంటారు. సాధారణంగా ప్రాసెస్ అయిపోగానే 15 రోజుల్లోగా కార్డులు వాహనదారులకు చేరుతాయి. కానీ రాష్ర్ట వ్యాప్తంగా లక్షకు పైగా కార్డులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వీటిలో డ్రైవింగ్ లైసెన్స్​ల కంటే ఆర్సీ కార్డులే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు, జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒకటి, రెండు ఆఫీసుల్లో మాత్రం పాత స్టాక్ ఉండటంతో కొంచెం ఆలస్యం అయినా జారీ చేస్తున్నారు. 
నాలుగు నెలలుగా..
రవాణా శాఖ ఆఫీసుల్లో నాలుగు నెలల నుంచి కార్డుల కొరత వేధిస్తోంది. సకాలంలో డ్రైవింగ్‌, ఆర్సీ కార్డులిస్తలేరు. సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి స్టేషనరీ రావడం లేదని, అందుకే లేట్‌ అవుతోందని అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడ ఒకటి, రెండు నెలలు సరిగా ఇస్తున్నా.. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోంది. కార్డులు లేకుండా వెళ్తే  ఫైన్లు పడతాయని వాహనదారులు బండ్లను బయటకు తీయడానికి భయపడుతున్నారు.  ఎం వాలెట్‌ పద్ధతి ద్వారా స్మార్ట్‌ ఫోన్‌లో ఆర్సీలు,  డ్రైవింగ్‌ లైసెన్సులు చూపే అవకాశం ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మందికి వీటిపై అవగాహన లేక ఇబ్బందులు తప్పడం లేదు. 
పైసలు ముందే చెల్లింపు..
కార్డుల కోసం అధికారులు డబ్బులు ముందే చార్జ్​చేస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్ కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తాడు. వాహనదారుడి డీటెయిల్స్ కార్డుపై ముద్రించి డ్రైవింగ్‌ లైసెన్సును పోస్టు ద్వారా పంపేందుకు రూ.35 పోస్టల్‌, రూ.250 సర్వీస్​చార్జీలతోపాటు ఇతర చార్జీలు ముందే వసూలు చేస్తారు. ఒక్కో వినియోగదారుడు సగటున రూ.1500 చెల్లించినా.. లక్ష అప్లికేషన్లకు రూ. 15 కోట్లకు పైగానే ఆర్టీఏ  ఖాతాలో జమ అయ్యాయి. ముందుగానే ఫీజుల రూపంలో కోట్లు చార్జ్​చేసిన రవాణా శాఖ.. స్మార్ట్‌కార్డుల జారీలో మాత్రం లేట్​చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. 
కార్డు కోసం చూస్తున్న..
నేను మే 1వ తారీఖు స్మార్ట్‌ కార్డు కోసం తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్న. నాలుగు నెలలు కావస్తున్నా ఇంకా కార్డు రాలేదు. ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్న. పైసలు మాత్రం ముందే కట్టించుకున్నరు. అధికారులు త్వరగా వచ్చేలా చూడాలి.
                                                                                                                                                     - సయ్యద్‌ జకీర్‌ హుస్సేన్‌, వాహనదారుడు