
ఐపీఎల్ -13కు కోహ్లీసేన సిద్ధం
స్టార్లతో కూడిన లైనప్
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్.. వరల్డ్ క్రికెట్లో టాప్ మోస్ట్ ప్లేయర్లు. ఎదురుగా మొనగాళ్లలాంటి బౌలర్లు ఉన్నా.. వీళ్ల బ్యాటింగ్ ముందు దిగదుడుపే. అయితే ఈ లెక్క ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు మాత్రమే సరిపోతున్నది. కానీ ఐపీఎల్లో మాత్రం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ బెంగను ఈ జోడీ తీర్చలేకపోతున్నది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పుష్కరకాలంగా ప్రయత్నిస్తున్నా… ఇప్పటికీ ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరినా.. టైటిల్‌ను ఒడిసిపట్టుకోలేకపోయింది. ఈ మూడు సీజన్లు మినహా.. లీగ్ మొత్తం ఆర్సీబీ పెర్ఫామెన్స్ అంతంతమాత్రంగానే ఉంది. ఓడిన ప్రతిసారి బౌలింగ్‌పై నిందలు వేస్తూ వచ్చిన బెంగళూరు ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తున్నది. మరి ఈసారైనా టైటిల్ కరువు తీర్చుకుంటుందో లేదో చూడాలి.
బలం..
ఆర్సీబీ బలం మొత్తం కోహ్లీ, డివిలియర్స్ అన్నది సత్యం. టీమ్ మొత్తానికి ఈ ఇద్దరూ మూల స్తంభాలు. వ్యక్తిగతంగానూ ఐపీఎల్లో ఈ ఇద్దరికి మంచి రికార్డు ఉంది. ఈ ఇద్దరూ నిలబడితే సిక్సర్ల జడివానలో పరుగుల వర్షం కురుస్తుంది. ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేసిన ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్ బలం రెట్టింపైంది. ఈ ముగ్గురూ తలుచుకుంటే ఎంతటి మ్యాచ్‌నైనా అపోజిషన్ నుంచి తేలికగా లాగేసుకుంటారు. ఫించ్‌కు కెప్టెన్సీ ఎక్స్‌పీరియెన్స్ ఉండటం కూడా ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఫీల్డ్‌లో విరాట్‌కు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ త్రయానికి తోడుగా ఇండియన్ డొమెస్టిక్ కుర్రాళ్లు అండగా నిలిస్తే చాలు. ఈసారి పేస్ బౌలింగ్‌ను కూడా ఆర్సీబీ మరింత బలోపేతం చేసుకుంది. రూ. 10 కోట్లు వెచ్చించి తీసుకున్న క్రిస్ మోరిస్ చేరిక పేస్ పదును పెంచింది. డేల్ స్టెయిన్, ఇసురు ఉడానతో పాటు ఇండియన్ స్టార్లు ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ గాడిలో పడితే ఆర్సీబీకి తిరుగుండదు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ ఆప్షన్లో కీలకం కానున్నాడు. యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆర్సీబీ కూడా టర్నింగ్ లోతును పెంచుకుంది. ఇండియన్ రిస్ట్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌తో పాటు ఆసీస్ టాప్ స్పిన్నర్ ఆడమ్ జంపా, వాషింగ్టన్ సుందర్, మొయిన్ అలీని కూడా అందుబాటులోకి తెచ్చుకుంది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మంచి బ్యాలెన్స్ కనిపిస్తున్న ఆర్సీబీకి ఫ్లే ఆఫ్ వరకు ఢోకా లేనట్లే.
బలహీనత..
ఆర్సీబీ అంటే ఠక్కున గుర్తొచ్చేది కోహ్లీ, డివిలియర్స్. అదే ఆ టీమ్‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. కనీసం ఈ ఇద్దరి స్థాయిలో సగమైనా టీమ్ భారాన్ని మోసే క్రికెటర్లు లేకపోవడం ప్రతికూలాంశం. పేపర్ మీద కనిపించే స్టార్లు గ్రౌండ్లో వీళ్లను మరిపించలేకపోతున్నారు. ప్రతి మ్యాచ్‌లో బ్యాటింగ్ మొత్తం విరాట్, ఏబీపైనే అతిగా ఆధారపడుతున్నది. మిడిలార్డర్లో బ్యాటింగ్ భారాన్ని మోసే ప్లేయర్ లేడు. ఒకవేళ ఏదైనా మ్యాచ్‌లో టాప్–3 విఫలమైతే ఇక ఆర్సీబీ కమ్‌బ్యాక్ కావడం చాలా కష్టంగా కనిపిస్తున్నది. ఆరోన్ ఫించ్ రాకతో అయినా ఆ పరిస్థితి మారుతుందేమో చూడాలి. ఇక, నాణ్యమైన డెత్ బౌలింగ్ అటాక్ లేకపోవడం వల్లే ఆర్సీబీ 30 శాతం మ్యాచ్‌లు ఓడిందని ఓ నివేదిక. కాబట్టి ఈ లోటును మోరిస్, సైనీ, స్టెయిన్, ఉమేశ్ పూరిస్తే బెంగళూరు టైటిల్ కష్టాలు కొంతవరకైనా తీరుతాయి. కెప్టెన్‌గా ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్ సక్సెస్ అయిన విరాట్.. ఐపీఎల్లో మాత్రం తేలిపోతున్నాడు. నిర్ణయాలు తీసుకోవడంలో, టీమ్‌మేట్స్‌లో విశ్వాసాన్ని నింపడంలో వెనుకబడిపోతున్నాడు. కాబట్టి ఈసారి ఆ బలహీనతలను అధిగమించాలి.
అంచనా..
పవర్ఫుల్ బ్యాటింగ్, ఆల్‌రౌండర్లు, స్పెషలిస్ట్ బౌలింగ్ అటాక్ ఉంది కాబట్టి.. ఈసారి కచ్చితంగా ఆర్సీబీని టైటిల్ పోరులో చూడొచ్చు. అంతకంటే ముందు ప్లే ఆఫ్స్ వరకు అయితే ఎలాంటి ఢోకా లేదు. ఈనెల 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బెంగళూరు ఐపీఎల్ తొలి పోరు మొదలుపెట్టనుంది.
జట్టు
బ్యాట్స్‌మెన్: కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, ఫించ్, గురుకీరత్ మన్, దేవదత్ పడిక్కల్
ఆల్‌రౌండర్స్: మొయిన్ అలీ, పవన్ నేగి, శివమ్ దూబే, పవన్ దేశ్‌పాండే, ఇసురు ఉడాన
కీపర్స్: పార్థివ్ పటేల్, జోష్ ఫిలిప్
బౌలర్స్: క్రిస్ మోరిస్, చహల్, నవ్ దీప్ సైనీ, స్టెయిన్, ఉమేశ్ , వాషింగ్టన్ సుందర్, ఆడమ్ జంపా, సిరాజ్, షాబాజ్ అహ్మద్.
For More News..