
జైపూర్: ఐపీఎల్ టీమ్ ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాల్ మరో కేసులో చిక్కుకున్నాడు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో జైపూర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే యూపీలోని ఘజియాబాద్‌లో మరో మహిళ పెట్టిన లైంగిక దాడి కేసును ఎదుర్కొంటున్న 27 ఏండ్ల దయాల్‌పై పోక్సో చట్టం కింద ఈకేసు నమోదవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దయాల్‌పై బుధవారం బీఎన్‌ఎస్, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు జైపూర్‌లోని సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనిల్ జైమాన్ తెలిపారు. 2023లో తనకు 17 ఏండ్లు ఉన్నప్పుడు దయాల్ తనపై తొలిసారి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
కెరీర్‌లో ఎదగడానికి సాయం చేస్తానని నమ్మించి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం జైపూర్‌కు వచ్చినప్పుడు ఓ హోటల్‌కు పిలిపించి మరోసారి బలవంతం చేశాడని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశ్ దయాల్‌పై ఇదివరకు ఘజియాబాద్‌లో ఓ యువతి కేసు పెట్టింది. పెండ్లి చేసుకుంటానని ఐదేళ్ల పాటు నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే, ఇప్పుడు జైపూర్‌లో మైనర్‌పై అత్యాచారం కేసు నమోదు కావడం అతడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ రెండు తీవ్రమైన ఆరోపణలపై యశ్ దయాల్ గానీ, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌సీబీ యాజమాన్యం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.