కోహ్లీ కేక.. 6 వికెట్ల తేడాతో కోల్‌‌కతాపై బెంగళూరు విజయం.. దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ

కోహ్లీ కేక.. 6 వికెట్ల తేడాతో కోల్‌‌కతాపై బెంగళూరు విజయం.. దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ

రాయ్‌‌పూర్‌‌: ఛేజింగ్‌‌లో విరాట్‌‌ కోహ్లీ (60 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 105 నాటౌట్‌‌) దుమ్మురేపడంతో.. ఐపీఎల్‌‌–19లో రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు కీలక విజయాన్ని అందుకుంది. దేవదత్‌‌ పడిక్కల్‌‌ (39) అండగా నిలవడంతో.. బుధవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో కోల్‌‌కతాపై గెలిచింది. ఫలితంగా ప్లే ఆఫ్స్‌‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. 

టాస్‌‌ ఓడిన కోల్‌‌కతా 20 ఓవర్లలో 192/4 స్కోరు చేసింది. అంగ్‌‌క్రిష్‌‌ రఘువంశీ (46 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 71), రింకూ సింగ్‌‌ (29 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 49 నాటౌట్‌‌), కామెరూన్‌‌ గ్రీన్‌‌ (24 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 32) రాణించారు. తర్వాత బెంగళూరు 19.1 ఓవర్లలో 194/4 స్కోరు చేసింది.

అంగ్‌‌క్రిష్‌‌, రింకూ అదరహో..
ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన కోల్‌‌కతాకు ఓపెనర్లు ఫిన్‌‌ అలెన్‌‌ (18), రహానె (19) మెరుపు ఆరంభాన్నిచ్చినా వికెట్లను కాపాడుకోలేకపోయారు. మూడో ఓవర్‌‌లో భువనేశ్వర్‌‌ (1/34).. అలెన్‌‌ను ఔట్‌‌ చేస్తే ఐదో ఓవర్‌‌లో రహానె.. హాజిల్‌‌వుడ్‌‌ (1/35) చేతికి చిక్కాడు. దాంతో 48/2 స్కోరుతో ఉన్న కేకేఆర్‌‌ ఇన్నింగ్స్‌‌ను అంగ్‌‌క్రిష్‌‌, గ్రీన్‌‌ ఆదుకున్నారు. స్ట్రయిక్‌‌ రొటేషన్‌‌ చేస్తూ 56/2తో పవర్‌‌ప్లేను ముగించారు. 

ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత ఆర్సీబీ బౌలర్లు రన్స్‌‌ కట్టడి చేశారు. రఘువంశీ 4, 6 కొట్టినా నాలుగు ఓవర్లలో 30 రన్స్‌‌ రావడంతో తొలి పది ఓవర్లలో స్కోరు 86/2కు పెరిగింది. 11వ ఓవర్‌‌లో అంగ్‌‌క్రిష్‌‌ రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్‌‌లో 6, 4, 4 కొట్టిన గ్రీన్‌‌ను 13వ ఓవర్‌‌లో రసిక్‌‌ సలామ్‌‌దార్‌‌ (1/35) పెవిలియన్‌‌కు పంపాడు. దాంతో మూడో వికెట్‌‌కు 68 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది.

14వ ఓవర్‌‌లో 4, 6తో రఘువంశీ 32 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఫోర్‌‌తో ఖాతా తెరిచిన రింకూ సింగ్‌‌ నిలకడగా ఆడటం, రఘువంశీ సిక్స్‌‌తో 15 ఓవర్లలో స్కోరు 141/3కి పెరిగింది. ఇక్కడి నుంచి ఈ ఇద్దరు బ్యాట్లు ఝుళిపించారు. 

వికెట్ల మధ్య వేగంగా సింగిల్స్‌‌, డబుల్స్‌‌ తీయడంతో పాటు చెత్త బాల్స్‌‌ను బౌండ్రీలకు తరలించారు.16వ ఓవర్‌‌లో ఇద్దరు 4, 6 కొడితే, ఆ వెంటనే రింకూ బౌండ్రీ బాదాడు. ఇక్కడి నుంచి ఓవర్‌‌కు ఓ ఫోర్‌‌ ఉండేలా జాగ్రత్త పడ్డారు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో రింకూ సిక్స్‌‌ కొట్టినా రఘువంశీ రనౌటయ్యాడు. నాలుగో వికెట్‌‌కు 76 రన్స్‌‌ జతకావడంతో కేకేఆర్‌‌ మంచి స్కోరు చేసింది. 

మెరుగైన ఆరంభం..
భారీ ఛేదనను ఆర్సీబీ కూడా మెరుగ్గానే ఆరంభించింది. తొలి ఓవర్‌‌లో రెండే రన్స్‌‌ వచ్చినా.. రెండో ఓవర్‌‌లో కోహ్లీ నాలుగు ఫోర్లు బాదాడు. తర్వాతి ఓవర్‌‌లో బెథెల్‌‌ (15).. 6, 4, 4తో 16 రన్స్‌‌ రాబట్టాడు. కానీ నాలుగో ఓవర్‌‌లోనే ఔట్‌‌ కావడంతో తొలి వికెట్‌‌కు 37 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. రెండు ఫోర్లతో టచ్‌‌లోకి వచ్చిన పడిక్కల్‌‌  మరో ఓవర్‌‌లో దాన్ని రిపీట్‌‌ చేశాడు. ఆరో ఓవర్‌‌లో కోహ్లీ సిక్స్‌‌తో పవర్‌‌ప్లేలో బెంగళూరు 66/1 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి ఈ ఇద్దరు నెమ్మదించడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 35 రన్స్‌‌ వచ్చాయి. దాంతో స్కోరు పది ఓవర్లలో 101/1కు చేరింది. ఈ క్రమంలో కోహ్లీ 32 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 

11వ ఓవర్‌‌లో కోహ్లీ, పడిక్కల్‌‌ ఫోర్‌‌, సిక్స్‌‌తో బ్యాట్లు ఝుళిపించారు. ఓవైపు బౌండ్రీలు, మరోవైపు సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో ఇన్నింగ్స్‌‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌‌కు 14వ ఓవర్‌‌లో కార్తీక్‌‌ త్యాగీ (3/32).. పడిక్కల్‌‌ను ఔట్‌‌ చేసి బ్రేక్‌‌ వేశాడు. రెండో వికెట్‌‌కు 92 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఈ దశలో రజత్‌‌ పటీదార్‌‌ (11) నిలకడగా ఆడినా.. కోహ్లీ రెండు ఫోర్లతో జోరు కొనసాగించాడు. 

15వ ఓవర్లలో స్కోరు 145/2గా మారింది. చివరి ఐదు ఓవర్లలో 48 రన్స్‌‌ చేయాల్సిన దశలో సిక్స్‌‌ కొట్టి పటీదార్‌‌ ఔటయ్యాడు. మూడో వికెట్‌‌కు 28 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. అయినా కోహ్లీ 4, 6, 6తో 58 బాల్స్‌‌లో సంచరీ పూర్తి చేశాడు. కానీ చివర్లో టిమ్‌‌ డేవిడ్‌‌ (2) ఔటైనా.. జితేష్‌‌ శర్మ (8 నాటౌట్‌‌)తో కలిసి కోహ్లీ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. 

సంక్షిప్త స్కోర్లు

కోల్‌‌కతా: 20 ఓవర్లలో 192/4 (అంగ్‌‌క్రిష్‌‌ 71, రింకూ సింగ్‌‌ 49*, భువనేశ్వర్‌‌ 1/34). బెంగళూరు: 19.1 ఓవర్లలో 194/4 (కోహ్లీ 105*, పడిక్కల్‌‌ 39, త్యాగీ 3/32).

* ఐపీఎల్‌‌లో అత్యధిక మ్యాచ్‌‌లు ఆడిన తొలి ప్లేయర్‌‌ విరాట్‌‌ కోహ్లీ (279). ధోనీ (278), రోహిత్‌‌ (278), జడేజా (265) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

* టీ20ల్లో తక్కువ ఇన్నింగ్స్‌‌ల్లో 14 వేల రన్స్‌‌ చేసిన బ్యాటర్‌‌ కోహ్లీ (409), క్రిస్‌‌ గేల్‌‌ (423) రెండో ప్లేస్‌‌లో ఉన్నాడు.

* ఐపీఎల్‌‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌‌ కోహ్లీ. బట్లర్‌‌ (7), గేల్‌‌ (6), రాహుల్‌‌ (6) తర్వాతి ప్లేస్‌‌ల్లో ఉన్నారు.