వాంఖడేలో ఆర్సీబీ పరుగుల సునామీ..ముంబైకు భారీ టార్గెట్

వాంఖడేలో ఆర్సీబీ పరుగుల సునామీ..ముంబైకు భారీ టార్గెట్

వాంఖడే స్టేడియంలో బెంగుళూరు ముంబైని బెంబేలెత్తించింది. ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక్కొడుతూ 20 ఓవర్లలో 6 వికెట్లకు 199  పరుగులు చేసింది. కెప్టెన్ డూప్లెసిస్, మాక్స్ వెల్ సూపర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 


టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఒకే పరుగు చేసిన కోహ్లీ జాసన్ బెహ్రెండోర్ఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జాసన్ బెహ్రెండోర్ఫ్  మరో వికెట్ తీసుకున్నాడు. అనూజ్ రావత్  క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో బెంగుళూరు 16 ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

డు ప్లెసిస్..మాక్స్ వెల్.. విధ్వంసం

ఈ సమయంలో కెప్టెన్ డు ప్లెసిస్ కు మాక్స్ వెల్ జతకలిశాడు. వీరద్దరు ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇదే క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. మూడో వికెట్ కు 120 పరుగులు జోడించారు. అయితే 33 బంతుల్లో 4 సిక్సులు, 8 ఫోర్లతో 68 పరుగులు చేసిన మాక్స్ వెల్  జాసన్ బెహ్రెండోర్ఫ్ బౌలింగ్ లోనే పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మహిపాల్ లామ్రార్(1), కెప్టెన్ డు ప్లెసిస్ (65) వెంట వెంటనే ఔటయ్యారు. 

దినేష్ కార్తీక్ దుమారం...

చివర్లో దినేష్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 18 బంతుల్లో సిక్స్, 4 ఫోర్లతో 30 పరుగులు సాధించాడు. ఇతనికి కేదార్ జాదవ్ (12), హసరంగా (12) పరుగులు చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు సాధించింది. ముంబై బౌలర్లలో బెహ్రెండోర్ఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. కామెరూన్ గ్రీన్, జోర్దాన్, కుమార్ కార్తీకేయా తలో వికెట్ దక్కించుకున్నారు.