మూసీ సుందరీకరణ ప్రాజెక్టు.. మార్కెట్ రేటు ప్రకారమే నష్టపరిహారం

మూసీ సుందరీకరణ ప్రాజెక్టు.. మార్కెట్ రేటు ప్రకారమే నష్టపరిహారం
  • ఆర్డీవో వెంకట్ రెడ్డి కీలక ప్రకటన
  • 60 రోజుల్లో అభిప్రాయ సేకరణ.. ఆపై స్వాధీనం
  • మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ స్వాధీనంపైనా స్పష్టత

గండిపేట, వెలుగు: మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్‌‌పూర్, దర్గా ప్రాంతాల్లో 83.13 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ఆర్డీవో వెంకట్ రెడ్డి మంగళవారం వెల్లడించారు.

బండ్లగూడ జాగీర్, ఉప్పర్​పల్లి సహా బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకుంటామని, ఇందులో 50 మీటర్ల పరిధిలో ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూడా ఉందని ఆయన తెలిపారు. 2004లో 12 మీటర్లుగా ఉన్న బఫర్ జోన్ పరిమితిని 2012లో 50 మీటర్లకు పెంచిన దృష్ట్యా గతంలో అనుమతులు పొంది నిర్మించినప్పటికీ ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించి దశలవారీగా స్వాధీనం చేసుకుంటామన్నారు.

ఎవరికీ అన్యాయం జరగకుండా ఎంజాయ్​మెంట్ సర్వే ద్వారా వాస్తవ పరిస్థితులను పరిశీలించి, రాబోయే 60 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసి పారదర్శక పద్ధతిలో ఈ ప్రక్రియను కొనసాగిస్తామని ఆర్డీఓ వెల్లడించారు.