టాలీవుడ్‌లో రీ రిలీజ్ మానియా.. కొత్తగా విడుదలయ్యే సినిమాలివే..

టాలీవుడ్‌లో రీ రిలీజ్ మానియా.. కొత్తగా విడుదలయ్యే సినిమాలివే..

ఒకసారి థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు.. మరోసారి విడుదలవ్వడం రీసెంట్ డేస్ లో ట్రెండింగ్ గా మారింది. తమ అభిమాన హీరోను మరోసారి సిల్వర్ పై చూసి, తరించేందుకు ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తుండడంతో ఈ కొత్త పద్ధతికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దాంతో పాటు మరోసారి ఊహించని రీతిలో వసూళ్లు రాబట్టడం చెప్పుకోదగిన విషయం. ఇప్పటికే ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలు మళ్లీ రిలీజై మంచి కలెక్షన్లు రాబట్టగా.. ఇప్పుడు అదే జాబితాలో మరికొన్ని సినిమాలు చేరనున్నాయి.

రిలీజైన నాటి నుంచి ఇప్పటివరకూ ట్రెండింగ్ లో ఉండి, ఇప్పటికీ మోస్ట్ పాపులర్ మూవీగా పేరు తెచ్చుకున్న సినిమా ఆర్ఆర్ఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ కాగా.. మరో రెండు రోజుల్లో జరగబోయే ఆస్కార్ వేడుకలకు తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి లాస్ ఏంజిల్స్ వేదికగా రెడ్ కార్పెట్ పై నడవనున్నారు. ఇక ఈ సినిమా కూడా ఈ రోజు రిలీజ్ అయ్యింది. దీంతో ఓ వైపు తారక్, మరో వైపు మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.

ఇక నందమూరి బాలకృష్ణ నటించిన సింహ మూవీ అప్పట్లో మంచి హిట్ ను సొంతం చేసుకోగా.. ఈ చిత్రం కూడా మరోసారి థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మూవీ మార్చి 11న విడుదల కానుండడంతో నందమూరి ఫ్యాన్స్ మరోసారి సంబరాలు చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2009లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన మగధీర ఇప్పటికీ మోస్ట్ వాచ్డ్ ఫిలింస్ లలో ఒకటిగానే నిలుస్తుంది. కాగా ఈ సినిమా కూడా మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మగధీర మూవీని మరోసారి రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధమయ్యారు.

ఈ జాబితాలోనే మాస్ అండ్ యాక్షన్ పాత్రలో తెరకెక్కిన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా మార్చి నెలాఖరులో రిలీజ్ కానున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక యూత్ కి బాగా కనెక్ట్ అయినా.. అంతగా హిట్ కి నోచుకోని రామ్ చరణ్ స్టైలిష్ పాత్రలో అలరించిన ఆరెంజ్ కూడా మార్చి 25న రీరిలీజ్ కానుంది. ఫ్యాన్స్ అభిమానంతో దేవుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ ఈ నెల లేదా ఏప్రిల్ లో థియేటర్లలో మరోసారి రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకూ రీరిలీజ్ అయిన సినిమాల్లో అత్యంత ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా నిలవడం గమనార్హం.