
కరోనా ప్యాండమిక్ టైంలో మిల్లెట్స్ వల్ల కలిగే లాభాల గురించి అందరికీ తెలిసింది. కానీ.. అన్నం వండినంత ఈజీగా మిల్లెట్స్‌ని వండలేం. అందుకే ఇప్పటి జెనరేషన్ కూడా ఈజీగా వండుకోగలిగేలా ప్రాసెస్ చేసి, మిల్లెట్ మిక్స్‌లను తయారుచేస్తోంది పలక్ అరోరా. దాంతో ఆమె నెలకు రూ. 3 లక్షలు వరకు సంపాదించడమే కాకుండా వాటిని పండించే రైతులకూ చేయూతనిస్తోంది.
హర్యానాకు చెందిన పలక్ అరోరా 2020లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎప్‌టీఈఎం)లో మూడో సంవత్సరం చదువుతోంది. అప్పుడే దేశమంతా కరోనా వ్యాపించింది. దాంతో అందరూ రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ ఏమిటా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
పలక్ ఫుడ్ టెక్నాలజీ చదువుతోంది కాబట్టి మరింత లోతుగా పరిశోధించింది. ‘‘ఇమ్యూనిటీని పెంచే రెడీ టు కుక్ ఫుడ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికా. కానీ.. అలాంటివి పెద్దగా దొరకలేదు. కేవలం ముడి చిరుధాన్యాలు, పిండి లాంటివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ.. వాటితో డిష్‌లు తయారుచేయడం అన్నం వండినంత ఈజీ కాదని అందరికీ తెలుసు. అందుకే చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. వాటిలోని పూర్తి పోషకాలు అందేలా వండాలంటే ప్రత్యేక ప్రాసెసింగ్ అవసరమని అర్థమైంది. ఉదాహరణకు.. గోధుమలను పిండి కొట్టించి రొట్టెలు చేసుకోవచ్చు. కానీ.. మిల్లెట్లను పూర్తి పోషకాహారంగా తీసుకోవాలంటే ముందుగా వాటిని నానబెట్టాలి.
మొలకెత్తిన తర్వాత ఎండబెట్టి, పిండి కొట్టించాలి. ఇలా చేయడం వల్ల పోషక సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పుడున్న బిజీలైఫ్‌లో గంటల తరబడి కష్టపడి ఇలా వండాలంటే కష్టమే. కొంతమందికి టైం ఉన్నా ఇంత పెద్ద ప్రాసెస్ చేయడానికి ఓపిక లేకపోవచ్చు. అందుకే 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ టైంలో వండగలిగే ఆరోగ్యకరమైన మిల్లెట్స్ ఫుడ్ తయారుచేయడానికి ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకున్నా” అంటూ చెప్పుకొచ్చింది పలక్.
గంటల తరబడి వండకుండా
మొదట్లో మొలకెత్తిన జొన్నల గంజి, వెజిటబుల్ ఇడ్లీలు, పంజాబీ స్టైల్ చీలా (పాన్‌కేక్‌లు) తయారుచేసింది. ముందుగా ప్రతి వంటకాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులకు తినిపించింది. వాళ్లు టేస్ట్ బాగుందన్నాకే మార్కెట్‌లో అమ్మింది. ఉద్యోగం చేస్తూనే 2021 సెప్టెంబర్‌లో ఆమె అధికారికంగా ‘సద్గురు సూపర్‌ఫుడ్స్’ పేరుతో కంపెనీ పెట్టింది. 2022 జూన్ నాటికి ‘మిలియం’ పేరుతో బ్రాండ్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
ఆ మరుసటి నెల ఉద్యోగం మానేసి ఫుల్ టైం తన వెంచర్ కోసమే పనిచేసింది. మిలియం అంటే లాటిన్‌లో ‘మిల్లెట్స్’ అని అర్థం. ఈ బ్రాండ్ ‘‘హెల్దీ భీ జల్దీ భీ”(ఆరోగ్యకరమైన, వేగవంతమైన) అనే ట్యాగ్‌లైన్‌తో జనాలకు మరింత చేరువైంది. టెర్రస్ కిచెన్‌లో మొదలైన ప్రయాణం కొన్నాళ్లకు ఫరీదాబాద్‌లో పూర్తి స్థాయి తయారీ యూనిట్‌కు చేరింది.
ఎలా చేస్తారు?
ముందుగా రైతుల దగ్గరనుంచి మిల్లెట్స్‌ని కొంటారు. వాటిని ప్రాసెసింగ్ యూనిట్‌కి తీసుకెళ్లి నానబెట్టి, కస్టమ్ చాంబర్లలో వేసి మొలకెత్తేలా చేస్తారు. ఆ తర్వాత డ్రైయర్లలో ఎండబెడతారు. కొన్ని ప్రొడక్ట్స్‌కి పప్పులు కూడా కలుపుతారు. ఆ మిశ్రమాన్ని పొడి చేసి, ప్యాక్ చేస్తారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ నెలకు ఎనిమిది టన్నుల రెడీ–టు–కుక్, 21 టన్నుల రెడీ–టు–ఈట్ మిల్లెట్ ప్రొడక్ట్స్‌ని ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా రాగి సూప్, మిల్లెట్ నూడుల్స్, పాస్తా, మిల్లెట్ పోహా, పాన్‌కేక్ మిక్స్ లాంటి పదిహేనుకుపైగా రకాల ప్రొడక్ట్స్‌ని అమ్ముతున్నారు. చిన్న ప్యాక్‌లకు రూ. 55 నుంచి పెద్ద బల్క్ ప్యాక్‌లకు రూ. 640 వరకు ధర ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఆర్డర్
వెబ్‌సైట్ ద్వారా నేరుగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసెస్‌లు, కస్టమర్లకు పెద్దమొత్తంలో ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. క్లీన్ లేబుల్ మిల్లెట్ ప్రొడక్ట్స్ కావాలి అనుకునే బ్రాండ్స్ కోసం వైట్-లేబులింగ్, కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ అగ్రిమెంట్స్ ద్వారా అమ్ముతున్నారు. వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్లు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా డెలివరీ కోసం షిప్‌రాకెట్, సేఫ్ పేమెంట్స్ కోసం రేజర్‌పే భాగస్వామ్యంతో పనిచేస్తోంది కంపెనీ.
రైతులకు సాయంగా..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మిల్లెట్స్ కలినరీ కార్నివాల్ లాంటి కార్యక్రమాలకు వచ్చిన మిల్లెట్స్ రైతులను పలక్ పరిచయం చేసుకుంది. వాళ్ల నుంచే తనకు కావాల్సిన చిరుధాన్యాలను అధిక ధరకు కొంటూ రైతులకు కూడా సాయం చేస్తోంది. ముఖ్యంగా రాగి , జొన్న , సజ్జలను రైతుల నుంచి నేరుగా సేకరిస్తోంది. ఎంతోమంది రైతులు ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సేంద్రియ రైతు అరవింద్ కుమార్ కొన్నేండ్ల నుంచి మిల్లెట్స్ పండిస్తున్నాడు. అయినా పెద్దగా లాభాలు రాలేదు. అప్పుడే అతను పలక్‌ని కలిశాడు. అప్పటినుంచి మిల్లెట్స్‌ని మార్కెట్ కంటే ఎక్కువ ధరకు ఆమెకు అమ్ముతున్నాడు. ఇలా అరవింద్‌కు మాత్రమే కాదు.. ఎంతోమంది మిల్లెట్స్ పండించే రైతులకు చేయూతనిస్తోంది పలక్. ‘‘మిల్లెట్స్ అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకుని పండుతాయి. వాటికి వరి, గోధుమలతో పోలిస్తే చాలా తక్కువ నీరు అవసరం. మిల్లెట్స్‌ను ప్రోత్సహించడం వల్ల రైతులకే కాదు.. నేలకు కూడా మేలు కలుగుతుంది. నేల, పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం మెరుగవుతుంది” అని చెప్పుకొచ్చింది పలక్.
నాన్న పరిస్థితి చూసి..
పలక్ రీసెర్చ్ చేస్తున్న టైంలోనే ఆమె తండ్రి కిడ్నీ సమస్యతో పోరాడుతున్నాడు. దానికి కారణం.. కొన్నేండ్ల పాటు శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు సరిగ్గా అందకపోవడమే అని డాక్టర్లు చెప్పారు. దాంతో స్టార్టప్ పెట్టాలనే ఆమె ఆలోచన దృఢ సంకల్పంగా మారింది. కరోనా టైంలో తను చదువుతున్న కాలేజీలో ల్యాబ్ మూసివేయడంతో ఫరీదాబాద్‌లోని తన ఇంటి టెర్రస్‌ని టెంపరరీ రీసెర్చ్, డెవలప్‌మెంట్ కిచెన్‌గా మార్చుకుంది. రకరకాల ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్‌ని ప్రయత్నించింది.
మొదట్లో తల్లిదండ్రులే ఆమెకు ఆర్థికసాయం చేశారు. “చుట్టుపక్కల వాళ్లు ఇది సక్సెస్ కాదని ఎంత చెప్పినా వినకుండా ప్రయత్నాలు చేశా. అప్పుడు నాన్న ‘నీ శక్తి మేరకు ప్రయత్నించు’ అని చెప్పి ప్రోత్సహించారు. నాపై ఆయనకున్న నమ్మకం నాకు ఎంతో శక్తినిచ్చింది. ప్రతి సవాలును ఎదుర్కొంటూ నన్ను ముందుకు నడిపించింది’’ అని పంచుకుంది పలక్. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు ఒక ప్రాసెసింగ్ విధానాన్ని ఎంచుకుంది. గింజల్లోని తేమను తొలగించడానికి సోలార్ డ్రైయర్లు, మిల్లెట్లను సరైన మోతాదులో కలపడానికి బ్లెండర్లు, మొలకెత్తిన చిరు ధాన్యాలు, పప్పులను మెత్తగా రుబ్బుకోవడానికి పల్వరైజర్లు లాంటి కొన్ని పరికరాలు కొని, ఇంట్లోనే ప్రాసెసింగ్ చేయడం మొదలుపెట్టింది.
నాకు చాలా నచ్చింది
ఈ స్టార్టప్ అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 49 ఏళ్ల యోగా టీచర్ పూనమ్ చద్దా ‘‘నేను ఇంతకుముందు ఎప్పుడూ మొలకెత్తిన చిరుధాన్యాల ప్రొడక్ట్స్‌ని తినలేదు. ఇవి జీర్ణక్రియని మెరుగుపరుస్తున్నాయి. మిలియం ప్రొడక్ట్స్‌లో రాగి సూప్, బీట్‌రూట్ ఇడ్లీలు నాకు చాలా ఇష్టం. వీటిని నా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తోపాటు స్టూడెంట్స్‌కి కూడా రెకమండ్ చేస్తున్నా” అని చెప్పుకొచ్చింది.