
- వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఎట్లొచ్చినయ్?
- జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ అవినీతి దృశ్యంగా మారింది
- ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసం ప్లీనరీ దగ్గర తెలుగు తల్లి విగ్రహం పెట్టిన్రు
- అమరులను, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను మరిచిన్రు
- ఏడున్నరేండ్ల పాలన పై చర్చకు సిద్ధమా..?: రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఇరవయ్యేండ్ల కింద ఉద్యమ ఆకాంక్షలతో జలదృశ్యంలో పుట్టిన టీఆర్ఎస్ నేడు అవినీతి దృశ్యంగా మారిపోయిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పెద్దగా వనరులు లేక కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నాడు ప్రారంభమైన పార్టీకి ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఉన్నాయని, ఇవన్నీ ఎట్లా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అత్యంత ధనవంతుడిగా కేసీఆర్ ఎదిగారని, పార్టీ ఆఫీసుల పేరిట వెయ్యి కోట్లు కూడగట్టారని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. నిజాం నవాబులను తలదన్నేలా కేసీఆర్ వారసులు తయారయ్యారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీకి రూ. 420 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయంటే వారి వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చనన్నారు. పార్టీ ఇరవయ్యేండ్లు పూర్తి చేసుకుందని ఏర్పాటు చేసుకున్న ప్లీనరీలో కనీసం అమర వీరులను స్మరించుకోలేదని, టీఆర్ఎస్ ఎదుగుదలకు తోడ్పడిన నేతల పేర్లను కూడా వేదిక మీద కేసీఆర్ ప్రస్తావించలేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్ మొదలుకొని ఎందరో మహానుభావులను కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని.. కొండా లక్ష్మణ్ బాపూజీ, బియ్యాల జనార్దన్ రావు, కేశవరావ్ జాదవ్, గూడ అంజయ్య, ఆలె నరేంద్ర, విద్యాసాగర్ రావు లాంటి వాళ్లను కనీసం తలుచుకోలేదని అన్నారు. పార్టీ ఎదుగుదల కోసం పని చేసిన నేతలు గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి, విజయరామారావు, రవీంద్రనాయక్, చెరుకు సుధాకర్, స్వామిగౌడ్ లాంటి వాళ్ల పేర్లను గుర్తు చేసుకోలేదన్నారు.
తెలుగు తల్లి విగ్రహం పెట్టిన్రు
టీఆర్ఎస్ ప్లీనరీ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు తెలుగు తల్లి విగ్రహం పెట్టారని రేవంత్ అన్నారు. తెలుగు తల్లి ఎవరికిరా తల్లి అని కేసీఆర్ అప్పట్లో అనేవారని ఆయన గుర్తుచేశారు. ‘‘ప్లీనరీకి ఆంధ్రా కాంట్రాక్టర్లు పెట్టుబడులు పెట్టారని, తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేసి వాళ్లను సంతృప్తి పరిచినట్లున్నరు” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు బొమ్మల్ని మాత్రమే ప్లీనరీలో పెట్టుకున్నారని, ఏడున్నరేండ్లలో సీఎం కేసీఆర్ సాధించిందేమీ లేదని విమర్శించారు. ఏడున్నరేండ్ల పాలనపై తాను చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, స్టూడెంట్లు స్కాలర్షిప్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియాకు ఎంత నిధులు కేటాయించారో చర్చిద్దామా అని డిమాండ్ చేశారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో లక్షా ఏడు వేల ఖాళీలున్నాయని కేసీఆర్ చెప్పారని, బిశ్వాల్ కమిటీ కూడా లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలున్నాయని చెప్పిందన్నారు. కవులు, కళాకారులు, జర్నలిస్టులు, తెలంగాణ సమాజం అంత కలిసి పోరాటం చేస్తే రాష్ట్రం సాకారమైందని, ఇప్పుడు కేసీఆర్ ఆ వర్గాలందర్నీ దూరం పెట్టారని ఆయన మండిపడ్డారు. పోరాట సమయంలో పెట్టిన కేసుల్ని ఇంత వరకు తొలగించలేదని.. కవిత, కేసీఆర్, కేసీఆర్‌పైన ఉన్న కేసుల్ని మాత్రం తొలగించుకున్నారన్నారు. కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరందలేదని విమర్శించారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, రాష్ట్రం ఆదుకుంటే తప్ప ఈ సంస్థలు గట్టెక్కవని ఆ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ఒక రిపోర్ట్ ఇచ్చారని, కేసీఆర్ దాన్ని చెత్త బుట్టలో వేశారని అన్నారు. ప్రభాకర్ రావు కొంత కాలంగా కనిపించడం లేదని, ఆయన ఎక్కడికి పోయారో కేసీఆర్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఒక ఉద్యోగి ఇన్ని రోజులు కనిపించకుండా పోతే ఎట్లా ఊరుకుంటారని ప్రశ్నించారు. ట్రాన్స్ కో, జెన్కోల ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.