రెచ్చగొడితే దాడులు చేస్తం ...కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఎంతవరకైనా సిద్ధం: మైనంపల్లి

రెచ్చగొడితే దాడులు చేస్తం ...కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఎంతవరకైనా సిద్ధం: మైనంపల్లి

హైదరాబాద్, వెలుగు:  కేటీఆర్​విషయంలో ఇన్నాళ్లు ఓపిక పట్టామని.. ఇంకా అలాగే సీఎం రేవంత్​రెడ్డిపై అహంకారపూరితంగా, ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రెచ్చగొడితే దాడులకూ పాల్పడతామని హెచ్చరించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. 

రేవంత్ పై అతిగా మాట్లాడితే బావ, బామ్మర్దులను బట్టలు విప్పి నడిరోడ్డు మీద నిలబెడతానని కేటీఆర్, హరీశ్​ను మైనంపల్లి హెచ్చరించారు. ‘‘కేటీఆర్.. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే జీవితంలో కూడా సీఎం కాలేవు. రెడ్ బుక్ అంటూ హెచ్చరిస్తున్నావు.. ఏం చేస్తవ్’’అని ప్రశ్నించారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పై, రేవంత్ పై విష ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు. 

హైడ్రాను తీసుకొచ్చిందే కేటీఆర్ అని, మూసీ నది వెంట ఉన్న ఇండ్లను కూలగొట్టాలని బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయన ప్లాన్ చేసిండని దుయ్యబట్టారు. పదేండ్ల బీఆర్ఎస్ అరాచక పాలనపై ఓ బుక్ రాసి గడప గడపకు పంచుతానని చెప్పారు. 

ఫోన్ ట్యాపింగ్ తో  సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల కుటుంబాల్లో చిచ్చు పెట్టాడని ఆరోపించారు. కేటీఆర్ మారువేషంలో ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకో అని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చాలా బాగుందని, బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ ల జీవితాలను నాశనం చేశారని విమర్శించారు.