12 వేల మెగావాట్ల సరఫరాకు రెడీ

12 వేల మెగావాట్ల సరఫరాకు రెడీ

ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌రావు

హైదరాబాద్, వెలుగు: ‘ఈ ఏడాది ఖరీఫ్‌‌లో కరెంటు డిమాండు 12 వేల మెగావాట్లకు చేరొచ్చు. ఆ డిమాండ్‌‌కు తగ్గట్టు సరఫరా చేసేందుకు మేం సిద్ధం’ అని ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌‌రావు తెలిపారు. గురువారం విద్యుత్‌‌సౌధలో స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. సీఎండీ మాట్లాడుతూ.. రాష్ట్రం రాక ముందు రికా ర్డు విద్యుత్‌‌ డిమాండు 6,660 మెగావాట్లేనని, ఇప్పుడది 10,818 మెగావాట్లకు చేరిందన్నారు. విద్యుత్‌‌ వ్యవస్థాపక సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 16,204 మెగావాట్లకు పెరిగిందన్నారు. విద్యుత్‌‌ సంస్థలు అమలు చేస్తున్న గ్రిడ్‌‌ డిసిప్లేన్‌‌ను సెంట్రల్‌‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రశంసించిందని చెప్పారు. జెన్‌‌కో థర్మల్‌‌ పవర్‌‌ స్టేషన్లు 80.13 శాతం పీఎల్‌‌ఎఫ్‌‌ సాధిస్తూ దేశంలో టాప్‌‌గా నిలుస్తున్నాయన్నారు.

విద్యుత్‌‌ సమస్యల పరిష్కారానికి ‘60 రోజుల ప్లాన్’

విద్యుత్‌‌ సమస్యల పరిష్కారం కోసం 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని టీఎస్‌‌ఎస్‌‌పీడీసీఎల్‌‌ సీఎండీ రఘుమారెడ్డి సిబ్బందికి సూచించారు. గురువారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో పంద్రాగస్టు వేడుకల్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం సంస్థలో రూ.41.82 కోట్లతో స్మార్ట్ గ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్, రూ.25 కోట్లతో స్కాడా, డీఎంఎస్‌‌ ప్రాజెక్ట్, రూ.336 కోట్ల వ్యయంతో దీన్‌‌దయాళ్​ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ పథకం, రూ.472 కోట్ల వ్యయంతో ఐపీడీఎస్‌‌ అమలవుతున్నాయన్నారు.