గుడ్ న్యూస్ ..జూన్ నుంచి అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి

 గుడ్ న్యూస్ ..జూన్ నుంచి అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి

హైదరాబాద్​లో నిర్మిస్తున్న మూడు టిమ్స్ దవాఖాన్లను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్​గా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. సిటీలో అల్వాల్, సనత్ నగర్, కొత్తపేటలో ఒక్కోటి వెయ్యి బెడ్ల కెపాసిటీతో ఉండేలా టిమ్స్ దవాఖాన్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో అల్వాల్ టిమ్స్​ను న్యూరోసైన్సెస్, సనత్ నగర్ టిమ్స్​ను కార్డియాక్ సైన్సెస్, కొత్తపేట టిమ్స్​ను గ్యాస్ట్రో సైన్సెస్ విభాగాల్లో సెంటర్స్ ఆఫ్​ ఎక్సలెన్స్​గా అభివృద్ధి చేయనుంది. ఈ మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లలో అత్యాధునిక ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌తో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తోంది. అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు ట్రామా కేర్ సెంటర్లు, ఆసుపత్రులకు అనుబంధంగా మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనుంది.

జూన్ నుంచి అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్ 

మూడు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని 2022లోనే ప్రారంభించినా.. అప్పటి ప్రభుత్వ విధానాల వల్ల పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం ఇండియన్ పబ్లిక్ హెల్త్ నిబంధనలకు విరుద్ధంగా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది. నిబంధలన ప్రకారం 15 అంతస్తులే నిర్మించాల్సి ఉండగా, 24 అంతస్తుల దాకా నిర్మించాలని నిర్ణయించింది. అలాగే, అల్వాల్ టిమ్స్ ను మొదట్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిర్మిస్తామని చెప్పారు. ఆ తరువాత అందులోనే మాతాశిశు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో అల్వాల్ టిమ్స్ నిర్మాణం ముందు అనుకున్న వరకే పూర్తయింది. 

అదనంగా నిర్మించాల్సిన అంతస్తులకు ఫండ్స్ లేక నిర్మాణం ఆలస్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇండియన్ పబ్లిక్ హెల్త్ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణాలు ఉండేలా చర్యలు చేపట్టి, నిర్మాణ పనులను వేగవంతం చేసింది. వీటిలో సనత్ నగర్ టిమ్స్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ టిమ్స్ లో ఓపీ సేవలను ప్రారంభించేందకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇక అల్వాల్ టిమ్స్ నిర్మాణం 70 శాతం, కొత్తపేట టిమ్స్ నిర్మాణం 30 శాతం పూర్తయింది. వీటినీ ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.  

ఎక్విప్మెంట్ కోసం రూ.1,000 కోట్లు 

హైదరాబాద్ లోని మూడు టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రూ. 1,000 కోట్ల వ్యయంతో వరల్డ్-క్లాస్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, లేజర్, రోబోటిక్ చికిత్సల కోసం అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి అందిన రూ. 4,150 కోట్ల రుణంలో కొంత భాగాన్ని ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. 

గ్యాస్ట్రోఎంటరాలజీ కోసం అధునాతన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, క్యాప్సూల్ ఎండోస్కోపీ, కాన్ఫోకల్ లేజర్ ఎండోమైక్రోస్కోపీ, రోబోటిక్- అసిస్టెడ్ ఎండోస్కోపీ మెషిన్లు, న్యూరాలజీ కోసం మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్, రోబోటిక్ న్యూరోసర్జరీ సిస్టమ్స్, గామా నైఫ్ రేడియో సర్జరీకి సంబంధించిన మెషిన్లు.. కార్డియాలజీ కోసం కార్డియాక్ కాథెటరైజేషన్ ల్యాబ్, కార్డియాక్ అబ్లేషన్ సిస్టమ్స్ వంటి హై-ఎండ్ ఎక్విప్‌‌మెంట్ కొనుగోలు చేయనున్నారు. ఈ అధునాతన మెషిన్లతో రోగులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన, వేగవంతమైన, అత్యుత్తమ చికిత్స అందనుంది.