
- రూ.128కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమిపూజ
మధిర, వెలుగు: మధిర పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మధిర పట్టణంలోని వైయస్సార్ విగ్రహం సమీపంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మధిర పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు కావాలన్న ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి రూ.128 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు.
99.56 కిలో మీటర్ల మేర సీవరేజ్ పైప్ లైన్, 6,638 గృహాలకు కనెక్షన్, 4 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించనున్నట్లు వివరించారు. పాత డంపింగ్ యార్డ్ వద్ద రాయపట్నం రోడ్డులో 5 ఎంఎల్డీ ఎస్టీపీ, మడుపల్లిలో 0.9 ఎంఎల్డీ ఎస్టీపీ, మధిర లేక్ వద్ద అంబర్ పేటలో 0.4 ఎంఎల్డీ ఎస్టీపీ, ఇల్లందులపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద 0.5 ఎంఎల్డీ ఎస్టీపీ నిర్మించనున్నట్లు చెప్పారు. మధిర పట్టణంలో మేజర్ స్టార్మ్ వాటర్ డ్రైన్, ఆర్సీసీ రిటైనింగ్ వాల్, ఓసీ ఈఎంఎస్ పరికరాల అమరిక పూర్తి చేస్తామన్నారు.
ఈ పనులను రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్పారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వల్ల మధిర పట్టణ వాసుల ఆరోగ్యం మెరుగుపడనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, పట్టణ అధ్యక్షుడు వెంకటరమణ గుప్తా, మున్సిపల్ కమిషనర్ సంపత్, మధిర తహసీల్దార్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
స్నానాల లక్ష్మీపురం గ్రామంలో పర్యటన
వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఆయన పర్యటించి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మండపం, స్నానాల ఘాట్, స్నానాల గదులు, ప్రహారీ నిర్మాణ పనులను, ఆలయం ఎదురుగా ఉన్న వైరా నది వాగు పై నిర్మాణం చేయనున్న రిటైనింగ్ వాల్, చెక్ డ్యాం, ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.