గ్రేటర్​లో రియల్ జోరు .. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

గ్రేటర్​లో రియల్ జోరు .. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
  •  గత ఏడు నెలల్లో రూ.4,670.52 కోట్ల ఆమ్దానీ
  • కొత్త భవనాల నిర్మాణాలకు దండిగా దరఖాస్తులు
  • నిరుడుతో పోలిస్తే పుంజుకున్న స్థిరాస్తి రంగం
  • మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో విస్తరణతో రియల్ ఊపు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకున్నది. భవనాలు, లేఅవుట్ల అనుమతులతో పాటు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతుల సంఖ్య పెరిగింది. ఎన్నికల కోడ్ టైమ్​లో దాదాపు మూడు నెలల పాటు ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. అయినప్పటికీ.. నిరుడుతో పోలిస్తే స్థిరాస్తి రంగం పుంజుకుంటూనే ఉన్నది. 

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో రియల్ రంగానికి మంచి ఊపు వచ్చింది. మరోవైపు ఔటర్ రింగ్ వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇది స్థిరాస్తి రంగానికి అనుకూలంగా మారింది. 

గతంతో పోలిస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. 2023, డిసెంబర్ నుంచి జూన్ నెలాఖరు వరకు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.4,670.52 కోట్ల ఆమ్దానీ వచ్చింది. అంతకు ముందు ఏడు నెలల్లో (2023, మే నుంచి 2023 నవంబర్ వరకు) వచ్చిన ఆదాయం రూ.4,429.23 కోట్లు. అంటే రూ.241.29 కోట్ల ఆదాయం పెరిగింది. 

పెరుగుతున్న హైదరాబాద్ విస్తీర్ణం

రోజురోజుకూ గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం పెరుగుతున్నది. ఇది స్థిరాస్తి రంగం వృద్ధికి సంకేతం అని విశ్లేషకులు అంటున్నారు. 2022, డిసెంబర్ నుంచి 2023, జూన్ తో పోల్చినా రూ.270.86 కోట్ల ఆదాయం పెరిగింది. గడిచిన ఏడు నెలల్లో మొత్తం 2,18,160 రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది ఇదే టైమ్​లో 1,93,962 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అంటే.. 12.5 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 54,111 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో 50,535 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిరుడుతో పోలిస్తే 7శాతం రిజిస్ట్రేషన్లు పెరిగినయ్. 

2023, డిసెంబర్ 7 నుంచి 2024, జూన్ 30 దాకా జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ పరిధిలో అనుమతి ఇచ్చిన భవనాల దరఖాస్తుల సంఖ్య 18,077 ఉండగా.. గతేడాది మే నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు భవన నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన సంఖ్య 17,911 మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు నెలల్లో భవన నిర్మాణాలకు ఆమోదించిన వాటి సంఖ్య 7,809 కాగా, అంతకుముందు ఏడు నెలలతో పోలిస్తే 13.17 శాతం ఎక్కువ అని అధికారులు తెలిపారు.