రౌడీషీటర్ ను చంపేందుకు ప్లాన్..

రౌడీషీటర్ ను చంపేందుకు ప్లాన్..

శంషాబాద్, వెలుగు: రౌడీషీటర్ హత్యకు స్కెచ్ వేసిన ఓ రియల్టర్ ను శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అతడిని అరెస్ట్​ చేయడంతోపాటు రెండు గన్స్, 44 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎండీ ఫరూఖ్ హైమద్(45) సౌదీకి వెళ్లి 2011లో తిరిగి వచ్చాడు. అదే ఏడాది రియల్ ఎస్టేట్ బిజినెస్  స్టార్ట్​చేసి చాలామందికి డబ్బులు అప్పుగా ఇచ్చాడు. పైసలు తిరిగి ఇవ్వనందుకు 2016లో కల్వకుర్తి, మహబూబ్ నగర్ రెండు చోట్ల 2 హత్యలు చేసి జైలుకెళ్లాడు. బెయిల్ పై బయటికొచ్చి సెటిల్ మెంట్లు, దోపిడీలు మొదలుపెట్టాడు. ఫరూఖ్ పై వివిధ చోట్ల11 కేసులున్నాయి. 2018లో నాంపల్లి పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి అతడిని మళ్లీ జైలుకు పంపారు. 2019లో జైలు నుంచి బయటకు వచ్చిన హైమద్.. రాజేంద్రనగర్​కు చెందిన రౌడీషీటర్ ​ముర్తుజా పహిల్వాన్​ను చంపేందుకు జుబేర్, ఖలీముద్దీన్ అలియాస్ ఏక్తాబాబాతో కలిసి స్కెచ్ వేశాడు. ఫైజల్ అనే వ్యక్తి వద్ద 2 గన్ లు, 44 బుల్లెట్లు కొని గగన్ పహాడ్ లోని తన ఇంట్లో దాచాడు. ముర్తుజాను చంపేందుకు 8 రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ జోన్ ఎస్ వోటీ పోలీసులు మంగళవారం ఫరూఖ్ ​ఇంట్లో తనిఖీలు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 2 గన్ లు, 44 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.