రాజీవ్ స్వగృహ ప్లాట్ల కోసం ఎగబడ్డ రియల్టర్లు

రాజీవ్ స్వగృహ ప్లాట్ల కోసం ఎగబడ్డ రియల్టర్లు
  • సర్కారు నిర్ణయించిన ధర కంటే డబుల్, ట్రిపుల్​ రేట్లు
  • ఎక్కువ ప్లాట్లను దక్కించుకున్న రియల్​ వ్యాపారులు, బిల్డర్లు
  • చుట్టుపక్కలున్న వెంచర్లకు రేట్లు పెంచుకునేందుకేనని అనుమానాలు
  • వేలం పాటలో పోటీపడలేక వెనుదిరిగిన సామాన్యులు

మహబూబ్​నగర్/గద్వాల/నల్గొండ/కామారెడ్డి, వెలుగు: రాష్ట్ర సర్కారు అమ్మకానికి పెట్టిన రాజీవ్​ స్వగృహ వెంచర్లలోని చాలా ప్లాట్లు అనూహ్యంగా అత్యధిక రేట్లకు అమ్ముడుపోయాయి. నల్గొండ, మహబూబ్​నగర్ లో 60 చొప్పున​, గద్వాలలో 58, కామారెడ్డిలో 62 ఇలా మొత్తం 240 ప్లాట్లకు సోమవారం ఓపెన్​ వేలం నిర్వహించగా, మెజారిటీ ప్లాట్లను రియల్టర్లు, బిల్డర్లు  సర్కారు నిర్ణయించిన ధర కంటే రెండు, మూడు రెట్లు అధికంగా పాడి దక్కించుకున్నారు. తొలిరోజు నాలుగు జిల్లాలోనూ క్లాస్​వన్​ప్లాట్లకు  వేలం వేయగా, కమర్షియల్​గా ఉపయోగపడే చాన్స్​ ఉండడంతో ప్లాన్​ ప్రకారం పోటీ పడి సొంతం చేసుకున్నారు. ఆయా చోట్ల ఉన్న తమ వెంచర్లకు రేట్లు పెంచుకునేందుకే ఈ స్థాయిలో రేట్లు పెంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద తొలిరోజు నాలుగు జిల్లాల్లో నిర్వహించిన వేలం పాట ద్వారా సర్కారుకు రూ. 80.49 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా,  ప్రభుత్వం పెట్టిన ప్లాట్లు కదా తక్కువ రేట్లకు వస్తాయేమోననే ఆశగా వచ్చిన సామాన్యులు రియల్టర్లతో పోటీపడలేక నిరాశతో వెనుదిరిగారు. అడపాదడపా తక్కువ రేట్లకు వచ్చిన వెస్ట్​, సౌత్​ ఫేసింగ్​ రెసిడెన్షియల్​ప్లాట్లు మాత్రమే  కామన్​ పబ్లిక్​కు దక్కాయి. 

మహబూబ్​నగర్​ జిల్లాలో రియల్టర్లు, బిల్డర్ల పోటాపోటీ

మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూర్​ మండలం అమిస్తాపూర్​లో రాజీవ్​స్వగృహకు చెందిన 60 ఓపెన్​ ప్లాట్లను రియల్టర్లు, బిల్డర్లు పోటీపడి దక్కించుకున్నారు.  ఇక్కడ 240 ఓపెన్​ ప్లాట్లు ఉండగా, అందులో 60 ప్లాట్లకు కలెక్టర్​ ఎస్​ వెంకట్రావు ఆధ్వర్యంలో  సిటీ శివారులోని వైట్​ కన్వెన్షన్​ హాల్​లో సోమవారం ఓపెన్​యాక్షన్​ నిర్వహించారు. బిడ్డింగ్​లో బిల్డర్లు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు, ప్రైవేట్​ ఫైనాన్షియర్లు పెద్దసంఖ్యలో పాల్గొని  కమర్షియల్​గా పనికివస్తాయనుకున్న ప్లాట్లను రెండు, మూడు రెట్లు ఎక్కువ పెట్టి కొన్నారు. సర్కారు నిర్ణయించిన రేటు గజానికి రూ.8  వేలు కాగా గరిష్ఠంగా 24వేల దాకా పాడి దక్కించుకున్నారు. మొత్తం మీద 60 ప్లాట్ల వేలం ద్వారా సర్కారుకు  తొలిరోజు రూ.37 కోట్ల ఆదాయం 
వచ్చింది. 

గద్వాలలోనూ సేమ్​ సీన్​.. 

గద్వాల జిల్లాలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లు కూడా అనూహ్యంగా డబుల్​ రేట్లు పలికాయి. 202 ప్లాట్లలో 58 ప్లాట్లకు జిల్లా కేంద్రంలోని బృందావన్​గార్డెన్​లో ఇన్​చార్జి కలెక్టర్ యాస్మిన్ బాషా ఆధ్వర్యంలో సోమవారం వేలం వేశారు. ప్రభుత్వ ధర రూ.5,500 కాగా, 350 మందికి పైగా పాల్గొన్నారు. వీరిలో అత్యధికులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లే కావడం గమనార్హం. వీరంతా పోటీపడి మరీ.. కార్నర్​, కమర్షియల్​ ప్లాట్లను అధిక రేట్లకు పాడి దక్కించుకున్నారు. చదరపు గజానికి కనిష్టంగా రూ.6500, గరిష్ఠంగా రూ.13,100 పాడారు. మొత్తంగా మొదటి రోజు సర్కారుకు రూ.14 కోట్ల 69 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు ప్రకటించారు.

నల్గొండ జిల్లాలో హాట్​ కేకుల్లా కమర్షియల్​ ప్లాట్లు.. 

నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది కమర్షియల్ ప్లాటకే మొగ్గుచూపారు. టౌన్​షిప్​ నల్గొండ సిటీకి పదికిలోమీటర్ల దూరంలో ఉండడంతో రెసిడెన్షియల్ ప్లాట్లకు ఇంట్రెస్ట్​చూపలేదు. కానీ భవిష్యత్తు అసరాలను దృష్టిలో పెట్టుకొని హైవేకు దగ్గరగా, ఎక్కువ విస్తీర్ణం కలిగిన కమర్షియల్ ప్లాట్లను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు.  మొత్తం 240 ప్లాట్లలో తొలి రోజు 60 ప్లాట్లకు సోమవారం వేలం నిర్వహించగా, 45 ప్లాట్లు అమ్ముడుపోయాయి. వీటిలో కమర్షియల్, మల్టిపర్పస్ ప్లాట్లు 33 ఉండగా, 12 మాత్రమే రెసిడెన్షియల్ ప్లాట్లు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు చదరపు గజానికి రూ.7వేలు కాగా, కమర్షియల్ ప్లాట్లు గరిష్ఠంగా రూ.13,500, రెసిడెన్షియల్ ప్లాట్లు  రూ7,700 పలికాయి. మొత్తం మీద తొలిరోజు 45 ప్లాట్ల ద్వారా సుమారు రూ.14 కోట్లు ఇన్​కం వచ్చింది. మిగిలిన ప్లాట్లకు ఈ నెల 17 వరకు ప్రతి రోజు ఉదయం 9  నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం పాట కొనసాగుతుందని కలెక్టర్ జీవన్ పాటిల్ తెలిపారు.

కామారెడ్డి జిల్లాలోనూ డబుల్​.. 

కామారెడ్డిలో తొలిరోజు 62 రాజీవ్​ స్వగృహ  ప్లాట్లను వేలం వేయగా, గజానికి సరాసరి రూ.9,575 పలికాయి. టౌన్​షిప్​లో మొత్తం 230 ప్లాట్లు ఉండగా,  చదరపు గజానికి రూ. 7 వేలతో ఆఫీసర్లు సోమవారం ఓపెన్​ యాక్షన్​ నిర్వహించారు.  రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్లాట్లకు, కార్నర్​లో ఉన్న ప్లాట్లకు ఎక్కువ రేటు వచ్చింది. గరిష్టంగా గజానికి రూ. 14,200 పలికింది. మొత్తం మీద  కలెక్టర్​ జితేష్​ వి పాటిల్ ఆధ్వర్యంలో తొలిరోజు జరిగిన వేలం పాటలో 110 మంది పాల్గొనగా, ప్లాట్ల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి రూ. 14.80 కోట్ల ఆదాయం లభించింది.

తప్పుకున్న సాధారణ జనం  

ప్రభుత్వం రాజీవ్​స్వగృహ ప్లాట్లను వేలం వేస్తుండడంతో తక్కువ ధరకు దొరుకుతాయేమోనని వచ్చిన ఉద్యోగులు, సామాన్యులకు నిరాశే మిగిలింది. సోమవారం వేలం వేసిన  నాలుగు జిల్లాల్లోనూ ప్లాట్లకు మొదట్లో పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఆఫీసర్లు రేట్లను రూ.10వేలు, రూ.8వేల నుంచి రూ.7వేలు, రూ.5500 కు తగ్గించి ఓపెన్​యాక్షన్​ నిర్వహించారు. కానీ ఆయా చోట్ల రియల్​ వ్యాపారులు, బిల్డర్లు పోటీపడి రెండు, మూడు రెట్లు ఎక్కువకు పాడారు. మహబూబ్​నగర్, గద్వాల​లాంటి చోట్ల నలుగురైదుగురు గ్రూపుగా ఏర్పడి మరీ ఎక్కువ రేట్లకు దక్కించుకున్నారు. వీళ్లలో చాలా మందికి చుట్టుపక్కల పెద్ద ఎత్తున వెంచర్లు ఉండడం, వాటిలో ప్లాట్ల రేట్లు పెంచుకునేందుకే ఇలా ఎక్కువకు పాడారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రియల్టర్లు, బిల్డర్లు అనూహ్య రీతిలో రేట్లను పెంచుతూ పోవడంతో ఎంప్లాయీస్,​సామాన్యులు యాక్షన్​ మధ్యలోంచే లేచివెళ్లిపోయారు.