సిద్దిపేట/దుబ్బాక, వెలుగుః దుబ్బాక మండలం ఆకారం పెద్ద చెరువుపై రియల్టర్ల కన్ను పడింది. చెరువు దగ్గరున్న భూములను కొనుగోలు చేసిన రియల్వ్యాపారులు.. చెరువు భూమిని కూడా మట్టితో నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆకారం పెద్ద చెరువు కింద ఏడు వందల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువుకు సమీపంలో ఉన్న 1909, 1919,1921 సర్వే నెంబర్ల లోని కొన్ని భూములను రియల్టర్లు కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని భూములు ఆకారం చెరువు ఎఫ్టీఎల్ లోనే ఉన్నా వ్యాపారులు ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని.. ఆ భూములను కొన్నారు. ప్రస్తుతం ఎండల వల్ల చెరువులో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో తాముకొన్న భూములను ఆనుకుని ఉన్న ఎఫ్టీఎల్ ప్రాంతంలో మట్టిని నింపి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఆదివారం రాత్రి దాదాపు వంద ట్రాక్టర్ల మట్టిని చెరువు ఎఫ్టీఎల్ భూమి లో పోసి చదును చేయడం ప్రారంభించారు. వీరికి రెవెన్యూ అధికారుల అండదండలుండడంతో స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు విషయాన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో దుబ్బాక తహసీల్దార్ సలీమ్, ఇరిగేషన్ డీఈ హరికిషన్ సోమవారం ఆకారం పెద్ద చెరువును పరిశీలించారు. ఎఫ్టీఎల్ భూమిలో మట్టి నింపినట్టు గుర్తించారు. ఎఫ్టీఎల్ భూమిని వ్యవసాయేతర పనులకు వినియోగించకూడదని, రియల్టర్ల పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.
