
ఫిట్నెస్ లేని బస్సు..
పర్మిషన్ లేని హాస్టల్..
అనుమతి ముగిసిన స్కూల్
పట్టించుకోని అధికారులు
వేములవాడ, వెలుగు: వాగేశ్వరి స్కూల్ బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఓ టెన్త్ స్టూడెంట్ ప్రాణాలు వదిలారు. వారి కుటుంబాలు ఆవేదనలో మునిగిపోయాయి. ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరి పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమెవరు, తప్పెవరిది..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని నాలుగో అంతస్తులో స్కూల్ నిర్వహిస్తున్నారు. హాస్టల్‌కు అసలు ఏ అనుమతీ లేదు.. బస్సుకు ఫిట్నెస్ లేదు.
పర్మిషన్ గడువు ముగిసినా..
వాగేశ్వరి స్కూల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ (ఒకటి నుంచి ఏడో తరగతి వరకు)లకు పర్మిషన్ లేదు. ఇంతకుముందు ఇందులో చైతన్య, వాగేశ్వరి రెండు స్కూళ్లు ఉండేవి. వాటిని కలిపేసి వాగేశ్వరి పేరిటే కొనసాగిస్తున్నారు. అప్పర్ ప్రైమరీ వరకు అనుమతి ఈ ఏడాది జూన్‌లోనే ముగిసింది. రెన్యువల్ కోసం స్కూల్ మేనేజ్మెంట్ దరఖాస్తు చేసుకుంది. కానీ స్కూల్ నిబంధనల మేరకు లేదంటూ స్థానిక ఎంఈవో ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. ఇలా అనుమతి లేకున్నా వాగేశ్వరి యాజమాన్యం క్లాసులు నిర్వహిస్తోంది. బుధవారం ప్రమాదంలో మరణించిన ముగ్గురు స్టూడెంట్లలో ఇద్దరు ప్రైమరీ స్కూల్(2వ తరగతి) వాళ్లే. ఇక స్కూల్ పిల్లలు ఉంటున్న హాస్టల్‌కు కూడా అనుమతి లేదు. ఊరి శివార్లలో రేకుల రూములు కట్టి హాస్టల్‌గా నిర్వహిస్తున్నారు.
స్కూల్ బస్సుకు ఫిట్ నెస్ లేదు..
ప్రమాదానికి గురైన మినీ బస్సు ఫిట్ నెస్ లేదు. ఈ విషయాన్ని సిరిసిల్ల జిల్లా రవాణా అధికారి కొండల్రావు ధ్రువీకరించారు. అసలు ఈ వెహికిల్ కండిషన్లో లేకపోవడం, ఇన్సూరెన్స్ కూడా లేకపోవడంతో ఫిట్నెస్ కోసం రాలేదని తెలిసిందని చెప్పారు.