MGBS మునిగిపోయి.. హైదరాబాద్ ను మూసీ ముంచెత్తడానికి కారణాలివే.. !

MGBS మునిగిపోయి.. హైదరాబాద్  ను మూసీ ముంచెత్తడానికి కారణాలివే.. !

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి. చాలా చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోస్తరు వర్షానికే సిటీలో రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయి.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి.. జనం జీవనం అస్తవ్యస్తమవ్వడం ప్రతిసారి జరిగేదే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి వరద నీరు వచ్చి చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. వరద నీటిలో బస్ స్టాండ్ లో చిక్కుకుపోయి జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శనివారం ( సెప్టెంబర్ 27 ) చాదర్ ఘాట్ ను ముంచెత్తింది మూసీ నది.

ఈ మధ్యకాలంలో ఎప్పుడూలేనంతగా మూసీకి వరద వచ్చి  చేరడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ళు నీట మునిగే పరిస్థితి తలెత్తింది. శంకర్ నగర్ లాంటి ఏరియాల్లో జనాన్ని పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. మూసీ ఉగ్రరూపం దాల్చడానికి, ఎంజీబీఎస్ మునిగిపోవడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూసీ ఉగ్రరూపానికి కారణాలివే: 

ఆక్రమణలకు వరద ముప్పు

రెండు జలాశయాలను – ఉస్మాన్ సాగర్,  హిమాయత్ సాగర్ – నది మీద కట్టి వర్షపు నీరును నిలువ చేసి ఉపయోగించే వ్యవస్థ ఏర్పాటు చేశారు.  మూసీనది పరీవాహక ప్రాంతంలో పడే వర్షాన్ని మోసే బుల్కపూర్, ఫిరంగ నాలాల నిర్మాణం చేపట్టి   చెరువులలో  నింపే ఏర్పాటు చేశారు. మూసీ నదిలో 25 చోట్ల కత్వాలు కట్టి వర్షం నీరు చెరువులలోకి  మళ్ళించారు.  ఇవన్నీ కూడా  సహజ, ప్రకృతి  నీటి వ్యవస్థకు  అనుసంధానంగా  నిర్మించారు. 


ఇవి సుస్థిరంగా ఉండడమే వాటి ప్రణాళికలో ఉన్న గొప్పతనం.  సహజ నీటి వ్యవస్థను గౌరవిస్తూ,  నీటిని ఉపయోగించే వ్యవస్థ ఆనాటి నుంచి కూడా సత్ఫలితాలను ఇస్తున్నది.  ఫలితంగా, 100 ఏండ్లలో మూసీ నది  వరద  హైదరాబాద్ నగరాన్ని నష్టపెట్ట లేదు.   అత్తాపూర్,  సంగం,  లంగర్ హౌజ్, చాదర్​ఘాట్​తదితర ప్రాంతాలలో ఆక్రమణలు ఎప్పటికైనా  వరద వల్ల నష్టపోతాయి.  

ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు, మట్టి దిబ్బలు ఉంటే ప్రవాహం ఇంకొక వైపు మళ్లి నష్టం పెంచవచ్చు.   ప్రభుత్వం నందనవనం ప్రాజెక్టు పేరుతో మూసీనది గర్భంలో  ప్రవాహాన్ని 9 మీటర్ల కాలువకు పరిమితం చేసి మిగతా భూభాగం ‘వాడుకుందాం’ అని ప్రణాళిక చేసింది.  ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఆ పథకం ముందుకు సాగలేదు. కానీ, అప్పటి కాలువ అక్కడక్కడా ఇప్పటికీ దర్శనం ఇస్తుంది. 


ఆక్రమణల తొలగింపుపై వ్యతిరేకత 

చట్టాల ప్రకారం GHMC, HMDA, ఇరిగేషన్, హైదరాబాద్ జల మండలి, రెవెన్యూ శాఖలకు బాధ్యతలు ఉండగా విధుల పట్ల నిర్లక్ష్యం కనిపించింది.  గత రెండు దశాబ్దాలలో ఆక్రమణల స్వరూపం మారింది.  స్థిర నివాసానికి తపనపడే  పేదలే కాకుండా మధ్య తరగతి, ధనిక వర్గాల ఇంటి మార్కెట్ పెరుగుదలలో భాగంగా ఆక్రమణలు జరిగాయి.  బహుళ అంతస్తులు,  భారీ నిర్మాణాలు,  కమర్షియల్ బిల్డింగ్ ఆక్రమణలు పెరిగాయి.  ఇప్పుడు  ఆక్రమణలు తొలగిస్తామని  ప్రభుత్వం  పూనుకుంటే  వ్యతిరేకత వస్తున్నది. మీడియాతో సహా అన్ని రంగాలలో ‘పరపతి’ ఉన్న వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నది. 

2000లో నందన వనం ప్రాజెక్టు పేరిట పేదలను నిర్వాసితులను చేస్తే కిక్కురుమనని ఈ వర్గాలు ఇప్పుడు తీవ్రస్థాయిలో ఆక్రమణల నిర్మూలన చర్యల పట్ల తమ ‘వ్యతిరేకత’ వ్యక్తపరచటానికి కారణం ఇదే.  ఆశ్చర్యంగా, ఈ వర్గాలు నగరంలో బిల్డింగ్ నిబంధనలు ఎట్లా సరళీకృతం చేశారు అనే దాని మీద విశ్లేషణలు చేయడం లేదు. కానీ, నది భూభాగం, FTL వంటి నిర్వచనాల మీద ధ్వజం ఎత్తుతున్నారు.  FTL అనేది చెరువుల నీటి నిలువను నిర్ధారించే ఒక కొలమానం. నది వైశాల్యం నిర్ధారించే కొలమానం flood plain area.  ఈ వైశాల్యం ప్రభుత్వమో, ప్రైవేటు వ్యక్తులు నిర్ణయించేది కాదు. నది తన ప్రవాహాన్ని బట్టి నిర్ణయిస్తుంది. మనం చేయాల్సింది అది ఎంత మేరకు ఉన్నది అని గుర్తించడమే.