రెబ్బెన ఎస్సై భవాని సేన్ సస్పెండ్

రెబ్బెన ఎస్సై భవాని సేన్ సస్పెండ్

కొమురం భీం జిల్లా రెబ్బెన ఎస్సై భవాని సేన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్​ కావడానికి తనకు స్థోమత లేదని, మెటీరియల్ ​ఉంటే ఇచ్చి సాయం చేయాలని అడిగిన ఓ యువతితో ఎస్ఐ భవానీ సేన్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్టేషన్ కి వస్తే బుక్స్​ ఇస్తానని పిలిచి లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో సదరు బాధితురాలు రెబ్బెన పీఎస్​లో ఎస్ఐపై కంప్లయింట్​ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల రాష్ట్ర సర్కారు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​రిలీజ్​ చేసింది. దీంతో పోలీసు కావాలని కలలు కంటున్న మండలానికి చెందిన ఓ యువతి ఎస్సై భవానీసేన్​ను ఆశ్రయించింది. సూచనలు, సలహాలు చెప్పాలని కోరింది. ఈ క్రమంలో ఆమెకు మెటీరియల్ ఇస్తానని భరోసా ఇచ్చాడు. కానిస్టేబుల్ ​కావాలంటే బుక్స్​చదివితేనే సరిపోదని, పోస్టులకు తగ్గట్టు ఫిజిక్​ ఉండాలన్నాడు. లేకపోతే జాబ్ ​రాదని, ఎత్తు, ఇతర మెజర్​మెంట్స్​చూస్తానని కొద్దిరోజుల కింద పోలీస్ స్టేషన్ కు పిలిపించాడు. కొలతల పేరుతో యువతి ప్రైవేట్​పార్ట్స్​తాకుతూ పైశాచికానందం పొందాడు. దీంతో ఎస్ఐ ప్రవర్తన నచ్చక ఆమె ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. మరుసటి రోజు నిజంగా మెటీరియల్​ ఇస్తానని పీఎస్​కు రమ్మన్నాడు. నమ్మి రావడంతో మెటీరియల్​ ఇవ్వకపోగా, ‘ఇంట్లో నా భార్య లేదు. నువ్వు ఇంటికి రా ’ అంటూ అసభ్యంగా మాట్లాడాడు. దీంతో వేధింపులు భరించలేక కుటుంబసభ్యులకు విషయం చెప్పి మంగళవారం రెబ్బన పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్ ​చేసింది. ఘటనను సీరియస్​గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై భవానీ సేన్ పై వేటు వేశారు.