- వానాకాలంలో 70.97 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
- 99 శాతం రైతులకు సన్న వడ్లు, బోనస్ డబ్బులు జమ
- పండుగ నాటికల్లా మిగతా వాళ్ల అకౌంట్లలోకి పైసలు
- మొత్తం చెల్లింపులు రూ.18 వేల కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు రికార్డు స్థాయిలో వానాకాలం ధాన్యం సేకరించింది. అత్యధికంగా70.97 లక్షల టన్నుల ధాన్యం సేకరించి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం సేకరణ జరగలేదు. ఇప్పటివరకు ధాన్యం సేకరణ ఎప్పుడూ 70.21 లక్షల టన్నులకు మించలేదు. ఈ యేడు వానాకాలంలో సేకరించినంత స్థాయిలో గత 25 ఏండ్ల కాలంలోనే ధాన్యం సేకరణ జరగలేదు. నిరుడు ఇదే సమయంలో 52.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ఈ యేడు ఇప్పటివరకు18.22 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం అధికంగా కొనుగోలు చేసింది.
రూ.18,129 కోట్ల చెల్లింపులు
రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్ లో అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మొత్తం 8,448 సెంటర్లు ఏర్పాటు చేసి, వడ్ల కొనుగోళ్లు చేపట్టింది. సోమవారం నాటికి 14 లక్షల మంది రైతుల నుంచి 38.45 లక్షల టన్నుల సన్నవడ్లు, 32.52 లక్షల టన్నుల దొడ్డు వడ్లు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రూ.16,946 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.16,704 కోట్లు(99 శాతం) రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
మిగిలిన రూ.242 కోట్లు రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే 7,494 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తుట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు. మరోవైపు, సంకాంత్రి సందర్భంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్ల బోనస్‌ను విడుదల చేసింది.
తాజాగా మొత్తం బోనస్డబ్బులు రూ.500 కోట్లు రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటివరకు వానాకాలం సన్న వడ్లకు సంబంధించి రూ.1,425.22 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇలా ధాన్యం డబ్బులు, బోనస్ కలిపి రూ.18,129 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలా ఈ సీజన్ లో ధాన్యం కొనుగోళ్లు, సెంటర్ల ఏర్పాటు, నిధుల విడుదల, నిధుల జమ, బోనస్ అన్నింటిలోనూ సివిల్ సప్లయ్స్ శాఖ రికార్డులు తిరగరాసింది.
లక్ష రూపాయలు బోనస్ వచ్చినయ్
నేను పదెకరాల్లో సన్న వడ్లు సాగు చేసిన. 508 బస్తాల వడ్లు పండినయి. వెన్నంపల్లి ఐకేపీలో 203.20 క్వింటాళ్లు అమ్మిన. ఈ ధాన్యానికి రూ.4,85,444 బ్యాంక్ అకౌంట్ లో పడ్డయ్. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ రూపంలో రూ.1,01600 జమ చేసింది.
- బియ్యాల ప్రశాంత్, వెన్నంపెల్లి గ్రామం, కాలువ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా
రూ.4 లక్షలు వచ్చినయ్
నాకున్న ఆరెకరాల్లో వరి వేస్తే 142 క్వింటాళ్ల ధాన్యం పండింది. పర్వతగిరి ఐకేపీ సెంటర్‌లో అమ్మిన. రూ.71 వేల బోనస్‌తో కలిపి మొత్తం రూ.4.06 లక్షలు నా అకౌంట్‌లో జమ అయినయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
- బానోత్ మోతీలాల్, రైతు, పర్వతగిరి మండలం, వరంగల్ జిల్లా
రెండు రోజుల్లోనే బోనస్ పడ్డది
సుల్తానాబాద్ అగ్రికల్చర్ మార్కెట్‌లో సన్నవడ్లను అమ్ముకున్నం. ముందు వడ్ల పైసలు పడ్డాయి. ఆ తర్వాత రెండ్రోజుల్లో బోనస్ పైసలు పడ్డయ్. చాలా సంతోషంగా ఉంది.- బండ మాధవి, సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా
పండుగ టైంకు పైసలు పడ్డయ్
సహకార సంఘంలో 57.60 క్వింటాళ్ల ధాన్యం అమ్మినం. బోనస్‌కింద రూ.28,800 వచ్చాయి. పండుగ టైంకు పైసలు పడ్డయ్. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ కమిషనర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు- నాగార్జున, నర్సింహుల గూడెం గ్రామం, నేరేడుచర్ల మండలం, సూర్యాపేట జిల్లా
గత 12 ఏండ్లలో వానాకాలంలో సేకరించిన ధాన్యం(లక్షల టన్నుల్లో)
2014-15: 11.04
2015-16: 15.13
2016-17: 16.52
2017-18: 18.27
2018-19: 40.43
2019-20: 47.09
2020-21: 48.75
2021-22: 70.21
2022-23: 65.02
2023-24: 47.34
2024-25: 53.95
2025-26: 70.97
