ఐదు రోజులు.. ఫుల్ కిక్కు.. డిసెంబర్ 1 నుంచి 5 వరకు రూ.940 కోట్ల లిక్కర్ సేల్స్

ఐదు రోజులు.. ఫుల్ కిక్కు.. డిసెంబర్ 1 నుంచి 5 వరకు రూ.940 కోట్ల లిక్కర్ సేల్స్
  • ఇటు పంచాయతీ ఎన్నికలు.. అటు జోరుగా స్టాక్ కొనుగోళ్లు
  • గ్రామాల్లో చుక్క, ముక్కతో మస్తు దావత్​లు
  • భారీగా ఆర్డర్ పెడ్తున్న కొత్త వైన్స్ షాపులు
  • బీర్ల కంటే విస్కీ, బ్రాందీ, రమ్ వైపే మొగ్గు

హైదరాబాద్, వెలుగు:ఓ వైపు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు.. మరోవైపు కొత్త వైన్ షాపుల స్టాక్ కొనుగోళ్లతో.. లిక్కర్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. 5 రోజుల్లోనే ఏకంగా రూ.940 కోట్ల విలువైన లిక్కర్ మద్యం డిపోల నుంచి లిఫ్ట్ అయింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో జోరుగా దావత్​లు నడుస్తుండడంతో లిక్కర్​కు ఒక్కసారిగా డిమాండ్​ పెరిగింది. ఇదే అదనుగా కొత్తగా ప్రారంభమైన వైన్స్ షాపులు భారీ మొత్తంలో స్టాక్​ కొనిపెట్టుకుంటున్నాయి. సాధారణంగానే కొత్త వైన్స్ ప్రారంభంలో ఎక్కువ స్టాక్ తీసుకోవడం ఆనవాయితీ.


కానీ.. ఎన్నికల సీజన్‌‌ కావడంతో ఆ కొనుగోళ్ల స్థాయి అసాధారణంగా ఉంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. మొదటి రెండు విడతల్లో ఎన్నికలు జరిగే ఏరియాల్లో ఈ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. గత నెలలో సాధారణంగా రోజుకు రూ.120 కోట్లలోపు ఉన్న అమ్మకాలు, ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న కొద్దీ రోజుకు రూ.200 కోట్లకు చేరుతున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. పల్లెల్లో ప్రతి అభ్యర్థి తమ అనుచరులు, ఓటర్లకు ప్రత్యేకంగా మందు పార్టీలు ఏర్పాటు చేస్తుండటమే ఈ రికార్డు స్థాయి అమ్మకాలకు ప్రధాన కారణమని ఎక్సైజ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 

1.30 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు

ఇక బీర్లతో పోలిస్తే ఐఎంఎఫ్ఎల్ (ఐఎంఎఫ్​ఎల్​) లిక్కర్ అమ్మకాలే టాప్ లో కొనసాగుతున్నాయి. చలికాలం ప్రభావం, ఎన్నికల కిక్కుతో మందుబాబులు ఎక్కువగా విస్కీ, బ్రాందీ, రమ్ వైపే మొగ్గు చూపుతున్నారు. డిసెంబర్ 4వ తేదీ డేటా ప్రకారం.. ఐఎంఎఫ్ఎల్ వాల్యూమ్ 1.79 లక్షల కేసులు అమ్ముడుపోగా, బీర్ 1.30 లక్షల కేసులకు పరిమితమైంది. నిరుడుతో పోలిస్తే ఐఎంఎఫ్ఎల్ అమ్మకాల్లో 90 శాతం వృద్ధి ఉండగా, బీర్ అమ్మకాల్లో కేవలం 19 శాతం వృద్ధి మాత్రమే కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల దావత్ ల్లో "హార్డ్ లిక్కర్"కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల నిర్వహణ కూడా ఈ అమ్మకాల పెరుగుదలకు పరోక్షంగా దోహదపడుతున్నది.

ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు

పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు, ఖర్చుకు వెనుకాడడం లేదు. గతంలోఎన్నికలకు ఒక రోజు ముందు క్వార్టర్ లేదా హాఫ్ బాటిల్ లిక్కర్​ను ఓటర్ల ఇండ్లకు పంపేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే ఊరూరా మందు పార్టీలు మొదలయ్యాయి. ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా లిక్కర్ కొని పంచుతున్నారు. దీనికితోడు ప్రచారంలో పాల్గొన్నవారందరికీ చుక్క, ముక్కతో దావత్ ఇస్తున్నారు. దీనివల్లే లిక్కర్ సేల్స్ అంతకంతకు పెరుగుతున్నాయి. 

తొలి విడత పంచాయతీలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా.. అప్పటికి రోజువారీ సేల్స్ మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. మద్యం విక్రయాలను నియంత్రించాల్సి ఉన్నా, రాత్రి వేళల్లో రహస్యంగా అమ్మకాలు జరుగుతున్నాయి. వైన్స్​ల నుంచి గ్రామాల్లోని బెల్టుషాపులకు చేరుతున్నాయి. 

డిసెంబర్​ 2న రూ.207 కోట్ల మద్యం లిఫ్ట్

కొత్త పాలసీ ప్రారంభమైన డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. లిక్కర్ సేల్స్ లో క్రమంగా పెరుగుదల నమోదవుతున్నట్లు స్పష్టమవుతున్నది. డిసెంబర్ 1న ఆదివారం ఏకంగా రూ.183.05 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇక మరుసటి రోజు డిసెంబర్ 2న ఈ జోరు మరింత పెరిగి రూ. 207.49 కోట్ల మేర విక్రయాలు జరగడం విశేషం. గతేడాది ఇదే సమయంతో పోల్చి చూస్తే అమ్మకాల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. గత సంవత్సరం డిసెంబర్ 2న కేవలం రూ.177.52 కోట్ల అమ్మకాలు జరగగా, ఈసారి అది దాదాపు 17 శాతం పెరిగింది.

 ఇక 3న రూ.187.52 కోట్లు, 4న రూ.178.29 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు తరలివెళ్లింది. 5వ తేదీన కూడా అదే స్థాయిలో అమ్మకాలు జరగగా.. ఇలా రోజుకు సగటున దాదాపు రూ.190 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ గణాంకాలు తీసుకుంటే.. 2024లో ఇదే రోజున రూ.88.69 కోట్ల అమ్మకాలు జరగగా, ఈసారి రూ.178.29 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఏకంగా 101.03 శాతం వృద్ధి నమోదైంది. అలాగే, నెలాఖరు వరకు చూసుకున్నా.. గత ఏడాది ఇదే సమయానికి రూ.560 మేర కోట్ల వ్యాపారం జరిగితే, ఈసారి అది రూ.940  కోట్లకు చేరింది. ఈ గణాంకాలు చూస్తుంటే రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు ఏ రేంజ్ లో డబుల్ అయ్యాయో తెలుస్తున్నది.

రాత్రిపూట ఊర్లలో మందు పంపిణీ

కొన్నిచోట్ల అభ్యర్థులు నేరుగా వైన్స్​ల నుంచి పెద్ద మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేసి దగ్గరివారితో రాత్రిపూట పంపిణీ చేయిస్తున్నారు. దీనికితోడు ఇటీవల కొత్తగా ఏర్పాటైన వైన్ షాపులు కూడా ఇప్పుడే ప్రారంభం కావడం ఈ సేల్స్ పెరగడానికి మరో కారణమని ఎక్సైజ్​ఆఫీసర్లు చెప్తున్నారు. కొత్త షాపుల యజమానులు తమ దుకాణాల్లో ఫుల్ స్టాక్ ఉండేలా చూసుకునేందుకు పోటీపడి మరీ డిపోల నుంచి సరుకును లిఫ్ట్ చేస్తున్నారు. దుకాణం నిండుగా సరుకు ఉంటేనే వ్యాపారం బాగుంటుందనే సెంటిమెంట్ తో పాటు, వినియోగదారులకు కావాల్సిన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో వ్యాపారులు భారీగా ఆర్డర్లు పెడుతున్నారు. నాలుగైదు రోజులుగా డిపోల వద్ద మద్యం లోడ్ల కోసం వాహనాలు బారులు తీరుతున్నాయి.

ఐదు రోజుల మద్యం అమ్మకాలు ఇలా (రూ. కోట్లలో)
డిసెంబర్​ 1    183.05
డిసెంబర్​ 2    207.49
డిసెంబర్​ 3    187.52
డిసెంబర్​ 4    178.29
డిసెంబర్​ 5    185.02